ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి ఎన్నికై అనైతికంగా టీడీపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం కోరింది. ఈమేరకు వైఎస్సార్‌సీపీ విప్ ఎన్.అమరనాథ్‌రెడ్డి శనివా రం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి అమరనాథ్‌రెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన వారు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులని వివరించారు.
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, తిరువీధి జయరాములు, కలమట వెంకటరమణ, మణి గాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారని తెలిపారు. 1986, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారు మరో పార్టీలో చేరితే అనర్హులవుతారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 2(1) ప్రకారం-191 (2) అధికరణను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియమాల్లోని 6వ నిబంధన (ఫిరాయిస్తే అనర్హులుగా ప్రకటించడం) మేరకు ఈ ఫిర్యాదు చేశారు.
ఫిరాయించిన వారికి ముఖ్యమంత్రి టీడీపీ కండువాలు కప్పడం, పత్రికల క్లిప్పింగ్‌లు, టీడీపీలో చేరినట్లు మీడియా ఎదుట ఎమ్మెల్యేలు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్‌లతో పాటు రెండు లేఖలను స్పీకర్‌కు అందజేశారు. తమనోటీసు ఆధారంగా అనర్హతపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని స్పీకర్‌ను కోరగా... ‘మీరిప్పుడే కదా నోటీసు ఇచ్చారు. పరిశీలిస్తా’ అని బదులిచ్చారు.
రెండు అవిశ్వాస తీర్మానాలపై పరిశీలన!
స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన తొలు త తమకు ఉన్నప్పటికీ ఒకే సమావేశాల్లో రెండు అవిశ్వాస తీర్మానాలు పెట్టవచ్చా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తున్నామన్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పీకర్ కన్నా ముందుగా ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తే అవిశ్వాసం పెట్టే అవసరం కలుగకపోవచ్చన్నారు. అలా కాకపోతే అపుడు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
స్పీకర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కళత్తూరు నారాయణస్వామి, కిలివేటి సంజీవయ్య, ముత్తిరేవుల సునీల్, వరుపుల సుబ్బారావు, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యక్కలదేవి ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి ఉన్నారు. నోటీసును స్వీకరించిన స్పీకర్ దానిని అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణకు ఇచ్చి అందినట్లు ధ్రువీకరించాల్సిందిగా ఆదేశించారు.
స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి: జ్యోతుల
ఎమ్మెల్యేల ఫిరాయింపునకు సంబంధించి తాము అన్ని సాక్ష్యాధారాలు స్పీకర్‌కు ఇచ్చామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు మరొకరు చేయరన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆయన అమరనాథ్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలసి మీడియాతో మాట్లాడారు. తామిచ్చిన నోటీసుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబుకు చెంప పెట్టు అవుతుందన్నారు. అనర్హులైన వారి స్థానాలన్నీ ఖాళీ అయితే ఉప ఎన్నికలొస్తాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి వారి మనోభావాలేమిటో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.