అన్నింటా విఫలమైనందుకే అవిశ్వాసం
♦ వైఎస్సార్‌సీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూ స్పష్టీకరణ
♦ విపక్షనేతపై టీడీపీ ఎమ్మెల్యేల దూషణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యమైన విధానాలతో అన్నింటా విఫలమైనందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వైఎస్సార్‌సీపీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. టీడీపీ సర్కారుపై సోమవారం ఆయన అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించి, చర్చకు అంగీకరించినందుకు ధన్యవాదాలంటూ ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. వాస్తవాలను చర్చించి తమ తీర్మానానికి మద్దతు పలకాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై చర్చను విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించేందుకు స్పీకర్ అనుమతితో పైకిలేచారు.
అయితే అవిశ్వాస తీర్మానం నోటీసు, తీర్మానానికి మద్దతు ఇచ్చిన వారి సంతకాల్లో పేరు లేనివారు చర్చను ప్రారంభించడానికి వీలుకాదంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు రూల్ 49ని తెరపైకి తేవడం ద్వారా విపక్ష నేతను అడ్డుకున్నారు. అయితే వేరేవారు చర్చను ప్రారంభిం చిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించడానికి తమకు అభ్యం తరం లేదన్నారు. దీంతో జ్యోతుల నెహ్రూ ఈ తీర్మానంపై చర్చను ఆరంభించి తదుపరి అవకాశాన్ని తమ నేత వైఎస్ జగన్‌కు ఇవ్వాలని కోరారు.
వెంటనే మంత్రి యనమల లేచి విపక్ష సభ్యుడు ఒకరు మాట్లాడగానే అధికార పక్ష సభ్యులకు ఇద్దరికి అవకాశమివ్వాలని, తర్వాతే మళ్లీ విపక్షానికి అవకాశం ఇవ్వాలంటూ మరో రూల్‌ను కోట్ చేశారు. తదుపరి టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్, బోండా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. వారిద్దరూ తమ ప్రసంగాల్లో ప్రభుత్వం చేసిన పనులు చెప్పడం కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విపక్షనేత, రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. రాజధానిలో టీడీపీ నేతల భూ దందా గురించి వార్తలు రాసిన ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు.