పార్టీ ఫిరాయింపులపై ముగిసిన వాదనలు
తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం
హైదరాబాద్: తమ పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు , అలాగే రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, మదన్ లాల్‌లు తమ తమ పార్టీల నుంచి ఫిరాయించారని, వాటిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిని మొదట విచారించిన సింగిల్ జడ్జి విచారణార్హత లేదంటూ కొట్టేశారు. దాన్ని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ఆయా పార్టీల నేతలు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ ఫిర్యాదులు స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నాయని, కాబట్టి ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. ఇదే విషయాన్ని 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులు ఇచ్చిన 9 నెలలు కావొస్తున్నా స్పీకర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, 9 నెలలుగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉండటం మంచిదికాదని తాము భావిస్తున్నామంది. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని నిరూపిస్తే తప్పక ఆ మేరకు ఆదేశాలిస్తామని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.