కాకినాడ : ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదని, కృష్ణాజలాల కేటాయింపు లో నోరు మెదడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అన్ని ప్రధాన సమస్యల్నీ గాలికి వదలడం వల్ల 23 రోజులుగా రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. స్థానిక భాస్కర బిల్డింగ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నోట్లతో ఎమ్మెల్యేలను కొనే వ్యవహారంలో దొరికిపోయిన చంద్రబాబు స్వీయరక్షణలో పడడంతో పాలన కుప్పకూలిపోయిందన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా విత్తనాలందక, రుణాలు రాక రైతులు విలవిలలాడే పరిస్థితి నెలకొందన్నారు. మేలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్షిక రుణప్రణాళికను ఖరారు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ ప్రయత్నమే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు రద్దు కాక, కొత్త అప్పులు పుట్టక, పెట్టుబడులు దొరక్క రైతులకు దిక్కుతోచడం లేదన్నారు.
వైఎస్‌లా ఆదుకోవాలి..
కేంద్రం మొక్కుబడిగా వరికి రూ.50 గిట్టుబాటు ధర ప్రకటించినా చంద్రబాబు మిన్నకుండిపోయారని జ్యోతుల విమర్శించారు. ఒకప్పుడు కేంద్రం మద్దతుధరను ఆశించినట్టు పెంచకపోతే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రం తరఫున మరో రూ.50 ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రస్తుతం రైతుల అవస్థలను గుర్తించి రూ.200 అదనంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో నిర్ణయించిన నీటి కేటాయింపులను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కృష్ణాజలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఎప్పుడో అంతరించిన బచావత్ అవార్డు ప్రకారం నీటి పంపిణీ వల్ల భవిష్యత్‌లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రధాన సమస్యలపై ప్రజలకు అండగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు గురువారం ఉదయం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్టు చెప్పారు. ఇటీవలి తుపాను కారణంగా మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. హుదూద్ తుపాన్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఐదులక్షలు ఇచ్చి, ఇప్పుడు రూ.లక్ష ఎందుకు కోత విధించారని ప్రశ్నించారు. వీరికి కూడా రూ.ఐదులక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నా ఏర్పాట్ల పరిశీలన
కాగా గురువారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లను జ్యోతుల పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ శ్రేణులు, రైతుల కోసం కలెక్టరేట్ వద్ద కల్పించాల్సిన సదుపాయాలు, మైక్, టెంట్‌లు తదితర అంశాలపై పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్‌తో చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, జిల్లా అధికార ప్రతినిధి కె.ఆదిత్యకుమార్, రాష్ట్ర కార్యదర్శులు జి.వి.రమణ, కాలా లక్ష్మణరావు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు భూపాలపట్నం ప్రసాద్, వరసాల జాన్ ప్రభాకర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జోగా రాజు తదితరులు ఉన్నారు.
‘తప్పు’కునే తిప్పలతో.. కుప్పకూలిన పాలన
Published Thu, Jun 25 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement
Advertisement