ఎత్తిపోతలు, ఇసుక అక్రమ రవాణాలపై
పోరుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధం
మార్చి ఒకటిన స్వదేశానికి రానున్న జ్యోతుల
విమానాశ్రయంలోనే ఆయనను కలవనున్న పార్టీ శ్రేణులు
అక్కడే పోరుబాట ఖరారు చేయాలని నిర్ణయం
మండపేట :పట్టిసీమ ఎత్తిపోతల పథకం జిల్లా రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అధికారపక్ష నేతల దన్నుతో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాతో కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ రెండు సమస్యలపై పోరుబాటకు వైఎస్సార్ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జిల్లాలో కాలుమోపగానే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని గురువారం మండపేటలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల అమెరికా పర్యటన ముగించుకుని మార్చి ఒకటిన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకు రానున్నారు. కాగా అధికారపార్టీ ఆగడాలతో ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు గిరజాల వెంకటస్వామినాయుడు, పెండెం దొరబాబు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), ఇతర ముఖ్యనేతలు మండపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు.
పోలవరం దిగువన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వలన జిల్లాలోని డెల్టాకు సాగునీటి ఇక్కట్లు తప్పవు. మరోపక్క జిల్లాలోని ఇసుక రీచ్‌లను అధికారపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డాలుగా మార్చుకుని కోట్లాది రూపాయల ఇసుకను పక్కదారి పట్టిస్తుండటంతో ప్రభుత్వానికి రాబడి పోవడంతో పాటు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ రెండు సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అమెరికా పర్యటన ముగించుకుని జిల్లాకు వస్తున్న జ్యోతులతో చర్చించి తుదిరూపం ఖరారు చేయనున్నారు. సమస్యల తీవ్రత దృష్ట్యా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మార్చి ఒకటిన మధురపూడి విమానాశ్రయానికి వెళ్లి జ్యోతుల రాగానే ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనివలన సమస్యల తీవ్రతను ప్రభుత్వం గుర్త్తిస్తుందన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున తరలిరావాలి : బోస్
జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేందుకు పార్టీశ్రేణులు పోరుబాటకు సిద్ధం కావాలని బోస్ పిలుపునిచ్చారు. విదేశీపర్యటన ముగించుకుని మార్చి ఒకటిన జిల్లాకు రానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతులను మధురపూడి విమానాశ్రయంలోనే కలిసి సమస్యలను వివరిస్తే వాటి ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా నలుమూలల నుంచి పార్టీశ్రేణులు విమానాశ్రయానికి తరలి రావాలని కోరారు. జిల్లా యువజన, ఎస్సీ సెల్, సేవాదళ్ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాసరావు, మార్గాని గంగాధర్, పార్టీ నేతలు వేగుళ్ల చైతన్యబాబు, భూపాలపట్ల ప్రసాద్, గొల్లపల్లి బుజ్జి, తోట రాజేశ్వరరావు, నక్కా మోహన్, తిరగటి కొండలరావు, ఆకిరి శ్రీనివాస్, పిల్లా వీరబాబు, శెట్టి నాగేశ్వరరావు, చింతలపూడి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
జనం కోసం..రణపథం
Published Fri, Feb 27 2015 1:00 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement