
క్షతగాత్రులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్
మండపేట: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో బుధవారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శిథిల భవనం శ్లాబు కూలిన ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైఎస్సార్‌సీపీ శ్రేణులు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించాయి. బహిరంగ సభ అనంతరం ఆస్పత్రిలో క్షతగాత్రులను జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బాధితులకు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్ జగన్ బహిరంగ సభను బుధవారం స్థానిక కేపీ రోడ్డులో ఏర్పాటుచేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అంచనాకు మించి వేలాదిగా జనం తరలివచ్చారు. తమ అభిమాన నేతను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంతో ప్రచార రథం సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శిథిల భవనంపైకి ఎక్కారు.
శిథిల భవనం కావడంతో ఒక్కసారిగా శ్లాబ్ కూలి కింద ఉన్న వారిపై పడిపోయారు. పోలీసులు, పార్టీ శ్రేణులు శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారిని మండపేటలోని పదో వార్డుకు చెందిన పిల్లే రామాయమ్మ (62), మండలంలోని పాలతోడుకు చెందిన సరాకుల సూరమ్మ (75)లుగా గుర్తించారు. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్ సీపీ అంటే పార్టీ మాత్రమే కాదని, రాజన్న కుటుంబమని బోస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment