
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
వైఎస్సార్ విగ్రహం తొలగింపుపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన
మండపేట : విగ్రహాలను తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి మహానేత వైఎస్సార్‌ను చెరపలేరని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు నినదించాయి. విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం మండపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నుంచి రాజారత్న సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా నిర్వహించి సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి లీలాకృష్ణ, పాపారాయుడు తదితరులు క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. లీలాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలు చేసిన వైఎస్సార్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. కుట్రపూరితంగా ఆయన విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి ఆయనను చెరపలేరన్నారు. పాపారాయుడు మాట్లాడుతూ ట్రాఫిక్‌కు అడ్డుగా లేకపోయినప్పటికీ కావాలనే వైఎస్ విగ్రహాన్ని తొలగించారని దుయ్యబట్టారు. తొలగించిన చోటే వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిషి్ఠంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు మేడపాటి లక్ష్మిప్రసాదరెడ్డి, తుపాకుల ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు పడాల సతీష్, మేడపాటి బసివిరెడ్డి, మేడపాటి సురేష్‌రెడ్డి, కాకర్ల శ్రీమన్నారాయణ, పలివెల శ్రీను, బత్తుల జాన్, తిరుశూల శ్రీను, పెయ్యల యాకోబు, జి. రాంబాబు, పొలమాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.