నీ రాజకీయ విన్యాసాలు అందరికీ తెలుసు’
Published Thu, Sep 19 2013 3:10 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
సాక్షి, కాకినాడ : ‘నీ రాజకీయ విన్యాసాలు అందరికీ తెలుసు.. ఇకనైనా చాలించకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారు. రాజకీయ భిక్ష పెట్టిన వారికే పంగనాలు పెట్టావ్.. ఇప్పుడు సిగ్గు వదిలేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్..జాగ్రత్త.! ప్రజా క్షేత్రంలో నీ పతనం ఖాయం’ అంటూ రాష్ర్ట మంత్రి తోట నరసింహాన్ని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి తోటపై జ్యో తుల నిప్పులు చెరిగారు. తానొక్కడినే సమైక్య వాదిగా ప్రజలతో ముద్ర వేయించుకునేందుకు మంత్రి తోట తంటాలు పడుతున్నారని ధ్వజ మెత్తారు. జగ్గంపేటలో మంగళవారం నిర్వహించిన సమైక్య సింహగర్జనలో సమైక్యవాదం కోసం మాట్లాడకుండా కేవలం వైఎస్ కుటుం బాన్ని, వైఎస్సార్ సీపీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
‘ఈయనను మాజీ మంత్రి అనాలో.. మంత్రి అనాలో అర్థం కావడం లేదు. ఆయన రెండు పర్యాయాలు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఎమ్మెల్యే నయ్యానోననే విజ్ఞతను కూడా మర్చిపోయి మహా నేతను, ఆయన కుటుంబాన్ని ఇష్ట మొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఒక్కసారి తన మన స్సాక్షిని ప్రశ్నించుకుంటే వాస్తవాలేమిటో తెలుస్తాయన్నారు. సమైక్యాంధ్ర పట్ల స్పష్టతతో ఉన్న రాజకీయ పార్టీల్లో సీపీఎం, ఎంఐఎంలతోపాటు ప్రజాబలమున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, పార్టీ జెండాతో సమైక్య ఉద్యమంలో పాల్గొనే దమ్ము,ధైర్యం, సత్తా తమకు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ర్ట విభజన సంకేతాలు వచ్చి న వెంటనే మా పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలే కాదు, మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహ న్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాజీనామాలు చేశారు,
నిరాహార దీక్షలు చేశారు. సీమాంధ్రులకు అండగా నిలిచారన్నారన్నారు. ప్రజాప్రతినిధులందరూ పార్టీలకతీతంగా ఒక వేదిక పైకి వచ్చి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప సమైక్యాంధ్ర పరిరక్షణ సాధ్యం కాదని, అప్పటి వరకు రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగే అవకాశం లేదన్నారు. దొంగ రాజీనామా చేసిన రాష్ర్టమంత్రి తోట నరసిం హం తన భార్య వాణి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ ప్రక్రియ నిలిచి పోయిం దని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో ఎవరు ఎప్పుడు ఆ ప్రకటన చేశారో చెబితే తామంతా సంతోషిస్తామని, కనీసం ఇప్పటికైనా ఆ ప్రకటన చేయిస్తే సీమాంధ్రులు 50 రోజులుగా రోడ్లెక్కి చేస్తున్న ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించారు. తొలుత సమైక్యాంధ్రకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందంటూ వైఎస్‌తో సహా పార్టీ అధినాయకులు చేసిన ప్రకటనలు, విభజన విషయంలో వివిధ పార్టీలు ఇచ్చిన లేఖలతో కూడిన ప్రచార బుక్‌లెట్‌ను పార్టీ నేతలతో కలసి ఆవిష్కరించారు. పార్టీ వాణిజ్య, ఎస్సీ సెల్ కన్వీనర్లు కర్రి పాపా రాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సీతారామచంద్ర వర్మ పాల్గొన్నారు.
Advertisement