నక్కపల్లి/ఎస్‌రాయవరం, న్యూస్‌లైన్: ఆవేదనతో సతమతమవుతున్న కోట్లాది మంది తెలుగు వారిలో ఆత్మస్థైర్యం నింపే ధ్యేయంతోనే సమైక్య శంఖారావం పేరుతో షర్మిల బస్సుయాత్ర చేపట్టారని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజవర్గ ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.
ఈనెల 14న విశాఖ జిల్లాలో జరగనున్న సమైక్య శంఖారావం పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గనేతలతో చర్చించేందుకు అడ్డురోడ్డు వచ్చిన ఆయన పార్టీ నాయకుడు చెంగల వెంకటరావు క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలవారికి సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసిన డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాన న్యాయం చేయకుండా ప్రాంతాల మద్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు నిర్ణయించిందని విమర్శించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన మనుగడ కోసం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో బూటకపు యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ జగన్, విజయమ్మ సమైక్య వాదాన్ని వినిపించి పదవులకు రాజీనామాలు చేశారని, తమ ఎమ్మెల్యేలు కూడా ఇదే డిమాండ్‌తో పదవులను త్యజించారని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తెలుగు వారు అతలాకుతలమయ్యారని, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు సమైక్యశంఖారావం పేరుతో బస్సుయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రతి తెలుగు వాడు ఈ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలపవచ్చని చెప్పారు. దీనిని పార్టీ ఉద్యమంగా ఏ ఒక్కరూ భావించవద్దని విజ్ఞప్తి చేశారు. సమైక్యంధ్ర కోరుకునే రాజకీయ,రాజకీయేతర, ఉద్యోగ-ఉపాధ్యాయ,కార్మిక జేఏసీలు సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సిపి జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు, పార్టీ ఉత్తరాంద్రజిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకు కొయ్యాప్రసాదరెడ్డి, నియోజకవర్గ ముఖ్యనేతలు మాజీ డిసిసిబి మాజీ చైర్మన్ ఆర్‌ఎస్‌రామచంద్రరాజు,ఆర్‌ఈసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్‌నియోజకవర్గ ముఖ్యనేతలు వీసం రామకృష్ణ, పెట్ల ఉమాశంకర్‌గణేష్,బొలిశెట్టి గోవిందు, చిక్కాలరామారావు, ధనిశెట్టి బాబూరావు, జానకి శ్రీను, విజయనగరం బాబు,ఆడారిప్రసాద్ పాల్గొన్నారు
తెలుగువాడికి వెన్నుదన్ను
Published Fri, Sep 13 2013 2:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement