కోరుమిల్లిలో శనివారం పోలీసులు జరిపిన దౌర్జన్యకాండలో బాధితులైన డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ భరోసానిచ్చింది. వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. నిబంధనల మేరకు ర్యాంపు రాబడిలో పావలా వాటా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేసి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీఐటీయూ నాయకులతో పాటు 25 మంది మహిళలను అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆదివారం కోరుమిల్లిలో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ఉద్యమానికి నేతృత్వం వహించిన సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.