
నేడు జగన్ రాక
స్కూలు బస్సు ప్రమాద మృతుల
కుటుంబాలకు ఓదార్పు
క్షతగాత్రులకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం రెండు గంటలకు మధురపూడి విమానాశ్రయానికి జగన్‌మోహన్‌రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి వెళ్తారు. ఇటీవల మోరంపూడి జంక్షన్ వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు. ఈ ప్రమాదంలో గోరక్షణపేటకు చెందిన ర్యాలి వెంకన్న, ఏవీ అప్పారావు రోడ్డుకు చెందిన శివనేని మహాలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను జగన్ ఓదారుస్తారు.
రాజమండ్రిలో కొద్దిసేపు బసచేసి అక్కడి నుంచి కాకినాడ చేరుకుంటారు. ద్వారంపూడి భాస్కర పద్మావతి ఫంక్షన్ హాలులో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కాకినాడ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. వధూవరులు అంజలి, హర్షవర్థనరెడ్డిలను జగన్‌మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు. రాత్రికి తిరిగి రాజమండ్రి చేరుకుని బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి షెల్టన్ హోటల్‌లో పార్టీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారు డు నరేన్ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి చేరుకుని, విమానంలో హైదరాబాద్ పయనమ వుతారు.