
ఉసురు తగలరాదంటే వాగ్దానం నెరవేర్చాలి
జగ్గంపేట : ‘ఆకలి మంటలతో ఉన్న రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మలచుకున్నావు. అధికారంలోకి వచ్చి అడుగడుగునా వంచన చేశావు. అతికీలకమైన వ్యవసాయాన్ని సర్వనాశనం చేశావు. అన్నదాత ఉసురు తగలకుండా ఉండేందుకు సంపూర్ణ రుణమాఫీని చేపట్టి మాట నిలుపుకో!’- ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పిన మాటలివి. రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సిద్ధమవుతుండగా చంద్రబాబు హడావుడిగా గురువారం రుణమాఫీపై ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై జ్యోతుల స్పందించారు. జగ్గంపేటలో రాత్రి పార్టీ నాయకుడు జీను మణిబాబు నివాసంలో జ్యోతుల మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటన తీరు చూస్తే రైతులను ఎంత చక్కగా మోసం చేయాలో అంత చక్కగా చేశారని అర్థమవుతుందన్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి రైతులతో ఆయన మైండ్ గేమ్ ఆడుకున్నారని, తొలి సంతకం పేరుతో మాఫీకి కాకుండా కేవలం విధివిధానాలకు కోటయ్య కమిటీ వేసి సరిపెట్టారన్నారు. పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన మాట మార్చి పంట రుణాలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. తరువాత రూ.1.5 లక్షల షరతు పెట్టారని, రూ.87 వేల కోట్లకు గాను కేవలం బడ్జెట్‌ను రూ.5 వేల కోట్లకు కుదించారని, ఇలా ప్రతి అంశంలో రైతులను మోసం చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. రైతాంగం రుణాలన్నింటినీ రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిగా రద్దు చేయాలని, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణ మాఫీ హామీని నెరవేర్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. డిమాండ్ల సాధనకు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, మంతెన నీలాద్రిరాజు తదితరులు పాల్గొన్నారు.