వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలురాయి | YS Jagan prajasankalpa yatra completes 100 constituencies | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలురాయి

Published Sat, Jul 28 2018 11:12 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YS Jagan prajasankalpa yatra completes 100 constituencies - Sakshi

సాక్షి, జగ్గంపేట(తూర్పు గోదావరి జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. జగ్గంపేటలో పాదయాత్ర ప్రవేశించడంతో 100 నియోజక వర్గాలు పూర్తయ్యాయి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవంబర్‌6, 2017న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 222 రోజుల్లో ప్రజాసంకల్పయాత్ర 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని జగ్గంపేట నియోజక వర్గంలోకి అడుగుపెట్టారు. వణికే చలిలోనూ, మండే ఎండల్లోనూ, హోరు వానలోనూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర కొనసాగించారు.

వైఎస్‌ జగన్‌ వేసే ప్రతి అడుగులో ప్రభుత్వ వైఫల్యాలు కనిపించాయి. లక్షల మంది జగన్‌ అడుగులో అడుగు వేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాయలసీమలో గ్రామీణ ప్రాంతాల వరకే కొనసాగిన ప్రజాసంకల్పయాత్ర, కోస్తాలో అడుగుపెట్టినప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లో కూడా కొనసాగింది. ప్రజాసంకల్పయాత్ర మొదలైనప్పటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువత నినదిస్తూ జగన్‌ వెంట నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్‌ జగన్‌కు లక్షల్లో విజ్ఞప్తులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మి మోసపోయామని రైతులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు.. ఇలా చాలా మంది వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.

రైతులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పెట్టుబడి పెరిగి, మద్దతు ధరలేకుండా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని తెలిపారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వైఎస్‌ జగన్‌తో వాపోతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తేనే తమ బాధలు తీరతాయని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ పనులను సైతం పక్కన బెట్టి వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement