
ప్రజా సంకల్పయాత్ర పైలాన్ వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు
బిందువు.. బిందువూ కలిసి సింధువైనట్లు.. అడుగు.. అడుగు కలిసి అభిమాన సంద్రమైంది. 14 నెలలు.. 3648 కిలోమీటర్లు.. అలుపెరగని బాటసారి ప్రజా సంకల్ప యాత్ర సాగింది. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే. అధికార మదం అడ్డంకులు సృష్టించినా.. రాజన్న చల్లని దీవెనలు.. ప్రజల ఆప్యాయత.. ఆత్మీయతలే తోడుగా.. ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన వైఎస్సార్ వారసుడు.. సుదీర్ఘ పాదయాత్ర ఘనంగా ముగిసింది. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నామన్నదే ఆయన సిద్ధాంతం. కష్టం చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తూ.. రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం అందించేందుకు చేసిన జన జాతర ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకూ అదే అభిమానం సాగింది. ముగింపులోనూ జననేత జగనన్నకు ఆశీస్సులు, అభినందనలు అందించేందుకు ప్రతి జిల్లా దారులన్నీ.. ఇచ్ఛాపురం వైపే సాగాయి. చిన్నా పెద్దా.. కార్యకర్త, నాయకుడు అనే తారతమ్యం లేకుండా అద్వితీయ ముగింపు సభలో పాలుపంచుకునేందుకు ఉరకలేసే ఉత్సాహం ప్రదర్శించారు.
విశాఖ సిటీ: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ఘనంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్ఛాపురం చేరుకొని జననేతకు అభినందనలు తెలిపారు. దారులన్నీ.. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచ్ఛాపురం వైపే సాగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు జననేతకు జేజేలు పలికేందుకు ఇచ్ఛాపురం వెళ్లారు. జననాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళ్తున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. తమ చెంతకే వచ్చి సమస్యలు సావధానంగా విని భరోసా ఇచ్చిన నాయకుడు దొరికాడంటూ ప్రజలందరూ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. నిఖార్‌సైన నేతగా.. నిలువెత్తు నిబద్ధతతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రజా సంకల్ప ధీరుడు జగనన్నే అనే ఒక అభయం రాష్ట్ర ప్రజలకు దక్కిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.
అందరూ అక్కడికే..
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు పాదయాత్ర ముగింపు సభాస్థలికి చేరుకునేందుకు ఉత్సాహం చూపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాల్లో ఇచ్ఛాపురం వెళ్లారు.
సంకల్ప ధీరుడికి జన నీరాజనం
సంకల్ప ధీరుడికి ముగింపు సభలో అశేష ప్రజానీకం విజయోస్తు అంటూ దీవెనలు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమం కోసం చేపట్టే పథకాలను, వాటి అమలుకు తీసుకునే చర్యలను వివరించడాన్ని ప్రజలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. అవినీతిరహిత పాలనను ప్రజల చెంతకే చేరువచేస్తానని, రేషన్ సరకులు డోరు డెలివరీ ఇప్పిస్తాననే హామీలు ప్రజల్లో ఆసక్తిని, ఆకాంక్షను కలిగించాయి.– మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ముగింపు సభలో నిజాయితీ, నిబద్ధతకే పెద్దపీట వేశారు. పంచాయతీలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తానన్న హామీ పేదల్లో ఆనందాన్ని నింపుతుంది. పార్టీ విజయానికి బాటలు వేసేలా చేసిన జగన్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే స్ఫూర్తితో పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఆవశ్యకత ఆసస్నమైంది. – వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్,వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త
వైఎస్‌ఆర్ అభిమాన కుటుంబం తరలివచ్చింది..
ఇచ్ఛాపురంలో ముగింపు సభకు యావత్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాన కుటుంబం తరలివచ్చింది. సంక్రాంతి వారం రోజుల ముందే జరిగినట్టు అనిపించింది. 150 రోజులలో మనందరం కలలుకన్న నవరత్నాల వంటి సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం సాకారం కాబోతోందని అందరూ చర్చించుకున్నారు. మూడు పాదయాత్రలు ఇచ్ఛాపురంలో ముగియడం.. అక్కడే ఈ మూడు పైలాన్‌లు ఉండటం స్థానిక ప్రజలు చేసుకున్న అదృష్టం. – అక్కరమాని విజయనిర్మల,భీమిలి సమన్వయకర్త, వైఎస్సార్‌సీపీ
ప్రజా సంకల్పయాత్ర అపూర్వ ఘట్టం
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ప్రజల కష్టాలను విని, వారికి అండగా నిలబడ్డారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.– తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీగాజువాక సమన్వయకర్త
జగన్‌పై ప్రజల్లో అపార నమ్మకం
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేస్తాననడంతో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో అపార నమ్మకం కలిగింది. జగన్ రైతు పక్షపాతిగా చెప్పడానికి ఆయన ప్రకటించిన వరాలు, స్థిర నిధి ఏర్పాటు హామీలే నిదర్శనం. ప్రస్తుతం వ్యవసాయం దండగా అనే నిస్పృహలో ఉన్న రైతులకు అది జగన్ సీఎం అయితే పండగా కాబోతోంది. – తైనాల విజయకుమార్, పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు
ప్రజల్లో ఎనలేని ఉత్సాహం
ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుం టూ.. ప్రజలందరికీ భరోసా ఇస్తూ సుదీర్ఘంగా జగనన్న పాదయాత్ర చేయడం ఓ రికార్డు. ఆ తుది ఘట్టం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు ఇచ్ఛాపు రం చేరుకున్నారు. ఆ జనసందోహం చూస్తే ఓ పండగ వాతావరణంలా కనిపించింది. పైలాన్‌ను ఓ సందర్శన స్థలంలా అద్భుతంగా నిర్మించారు. రాష్ట్ర ప్రజలకు జగనన్న ముందస్తు కానుకలు ఎన్నో అందించారు.
– వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ అనకాపల్లిపార్లమెంట్ జిల్లా సమన్వయకర్త
ఇచ్ఛాపురంలో ముగింపు అదిరింది..
ఇచ్ఛాపురంలో సంకల్పయాత్ర ముగింపు అదిరింది. సభకు యావత్ రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలపైనే ప్రజలు చర్చించుకున్నారు. ప్రజల్లో, పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం రెట్టింపైంది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో కనిపించింది.– డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి,వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త
ప్రజలకు నమ్మకం కలిగించారు
జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వినడం వల్ల ఆయనపై విపరీతమైన నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పెంచుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని కళ్లారా చూశారు. ఓ గొప్ప నాయకుడుని కలుసుకుని ప్రతీ కుటుంబం ఎంతో సంతోషపడింది. యువత కష్టాలకు కాలం చెల్లి రేపటి భవిష్యత్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది.
– కె.కె.రాజు,ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ సీపీ