
వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వెఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
కాకినాడ: ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకంలో ‘మేముసైతం’... అంటూ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో బుధవారం జరిగిన పైలాన్ ఆవిష్కరణ, చివరి రోజు పాదయాత్ర ... బహిరంగ సభలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి ఉత్సాహంగా తరలి వెళ్లారు. అభిమాననేతకు బాసటగా ‘మీ వెంటే మేమం’టూ ఆయా ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో ఆయా నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కారులు, బస్సుల్లో బుధవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పినపే విశ్వరూప్, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగంఅధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితర నేతలు పాదయాత్రకు పార్టీశ్రేణులతో తరలి వెళ్లారు. వివిధ నియోజక వర్గాలకు చెందిన కో–ఆర్డినేటర్లు తమ ప్రాంతాలకు చెందిన పార్టీశ్రేణులతో కలిసి ఇచ్చాపురం చేరుకున్నారు.
మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు మార్గాని భరత్, చింతా అనురాధ, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పొన్నాడ వెంకటసతీష్‌కుమార్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా యువజన విభా గం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, మాజీ కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాజమహేంద్రవరం, కాకినాడసిటీ పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, ఆర్‌వీజేఆర్ కుమార్, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ తదితరులు వేలాదిగా వెళ్లిన పార్టీశ్రేణులు జగన్ వెంట నడిచారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను సందర్శించడంతో పాటు చివరి బహిరంగ సభలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లాలో సంబరాలు...
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీశ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాకినాడ కొండయ్యపాలెంలో కేక్‌కట్ చేసి చిన్నారులకు పండ్లు, మిఠాయిలు పంచారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తనయుడు ఆకుల విజయ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అచ్చమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర లీగల్‌సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు ఇచ్చాపురంలో పైలాన్‌వద్ద పాదయాత్ర 341 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 341 బెలూన్లను ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment