బహిరంగ సభలో జగన్ ప్రశ్నలకు సమాధానాలిస్తున్న జనులు, వేదికపై పార్టీ నాయకులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నేల ఈనిందా అన్నట్లు ఇచ్ఛాపురం కదం తొక్కింది. రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుత చంద్రబాబు పాలనపై ఉన్న నిరసన ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. ప్రజాసంకల్ప తీవ్రతను రాష్ట్రానికి చాటిచెప్పింది. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర జనం తరలిరావడంతో ఇచ్ఛాపురం జనసంద్రమైంది. రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించడానికి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో దిగ్విజయంగా ముగిసింది. ఇడుపులపాయలో మొదటి కిలోమీటర్‌తో ప్రారంభమైన ఈ చరిత్ర బుధవారానికి ఇచ్ఛాపురం చేరుకుని ఏకంగా 3648 కిలోమీటర్ల మేరకు చేరి యాత్రను ఓ చరిత్రలా ముగించింది. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ఈ దృఢ సంకల్ప ముగింపునకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో వ్యతిరేక సర్కా ర్ వెన్నులో వణుకు పుట్టింది.
చంద్రబాబు దుష్ట సర్కార్‌ను తరిమికొట్టేందుకు నవరత్నాలే సమరాస్త్రాలుగా ప్రజా సంక్షేమమే సంకల్పంగా చేపట్టిన సంకల్ప యాత్రికుడికి జనం జయ జయ ధ్వానాలు పలికారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ముగింపు సభలో చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తడంతో పాటు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలపై జగన్ వివరించారు. వేలాది కిలోమీటర్లు మేరకు తానే నడిచినప్పటికీ నడిపించింది మాత్రం ప్రజలే అని చెప్పడం విశేషంగా చెప్పవచ్చు. ఇదిలావుంటే ముగింపు సభ జరుగుతున్న సమయంలో జిల్లాలో పలు చోట్లతో పాటు ప్రధానంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి తదితర నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా టీవీల్లో చూసే అవకాశాలు లేకుండా సర్కార్ చేసిన ఈ కుటిల చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
హాజరైన నేతలు
ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంకల్పానికి తుది లక్ష్యానికి చేరుకోనున్న నేపథ్యంలో పలువురు జగన్‌తో కలిసి అడుగులు వేశారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, గొర్లె కిరణ్‌కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి, రాష్ట్ర పార్టీ సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, ముఖ్యనేతలు దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, ఎన్ని ధనంజయ, మామిడి శ్రీకాంత్, హనుమంతు కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిన్ను నమ్మం బాబూ..అంటున్నారంతా..
‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేసిన చంద్రబాబును ఇక నమ్మేది లేదంటూ జనం గట్టిగా చెబుతున్నారని వైఎస్ జగన్ అనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ప్రజ లను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరాజకీయాలతో పాటు అవినీతి అక్రమాలను జగన్ ఎండగట్టాడు. పాదయాత్రలో ఎన్నో రకాల సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు చేసిన మోసాలను చెప్పారని, అప్పట్లో చంద్రబాబుకు ఓటేసి మోసపోయామన్నారు. రుణమాఫీపై మోసం చేయడంతో రైతులంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అని అంటున్నారని, పొదుపు రుణాలు, బంగారు రుణాల మాఫీపై మోసం చేయడంతో డ్వాక్రా మహిళంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని జగన్ చెప్పడంతో జనంలో మంచి స్పందన వచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడంతో నిరుద్యోగులు, యవత కూడా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని, అలాగే యువకులు, గ్రామాల్లో ప్రజలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు చెయ్యకపోవడంతో విద్యార్థులు, వైద్యం సక్రమంగా అందివ్వని కారణంగా రోగులు తదితర వర్గాల ప్రజలంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ అంటున్నారని జగన్ చెప్పడంతో విశేష స్పందన వచ్చింది.
ఘనంగా విజయ స్తూపం ఆవిష్కరణ
ప్రజాసంకల్పయాత్ర ముగింపునకు గుర్తింపుగా ఇచ్ఛాపురానికి సమీపంలో అద్భుతంగా నిర్మించిన విజయ స్తూపాన్ని (పైలాన్) వైఎస్ జగన్ ఘనంగా ఆవిష్కరించారు. 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లతో అద్భుత రీతిలో టోంబ్‌తో పాటు గ్రీనరీ లాన్, దివంగత వైఎస్సార్ ఫొటోలు, అలాగే జగన్ పాదయాత్ర చేసిన రూటు తదితర వివరాలన్నీ ఈ స్తూపంలో ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది.
ఈ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు యువకులు పెద్ద సంఖ్యలో సీఎం సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఇదే మార్గంలో దివంగత వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పైలాన్, వైఎస్ షర్మిళ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పైలాన్‌లు కూడా ఉండడంతో యాత్రలో భాగంగా జగన్ వాటిని తిలకించి సభకు హాజరయ్యారు.
పాదయాత్రకు జన నీరాజనం
ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఉదయం కవిటి మండలం అగ్రహారం నుంచి భారీ జనసందోహం నడుమ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. జాతీయ రహదారి మీదుగా కొజ్జీరియా కూడలి, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట, లొద్దపుట్టి వరకు యాత్ర సాగింది. విరామం అనంతరం ముగింపు పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం మళ్లీ పాదయాత్రగా ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుని బహిరంగ సభను నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఆద్యంతం అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ముగింపు రోజు కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభం నుం చి వేదమంత్రాలు, శంఖారావం, కోలాటాలు, బిందెల నృత్యాలతో జగన్‌కు స్వాగతం పలి కారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోకి జగన్ రాగానే మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఘన స్వాగతం పలికారు.
రైతుల కళ్లల్లోఆనందం చూడాలని..
పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని అనడంతో రైతులంతా హర్షం ప్రకటించారు. పంటలకు ఏటా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, అలాగే ముందస్తు పెట్టుబడిగా మే నెలలో ప్రతి రైతుకు రూ.12500 నేరుగా ఇస్తామని ప్రకటించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రైతులు వినియోగించే ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, అలాగే రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి, అలాగే పంట భీమాను ఇక రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేసి, రైతన్న ఆదాయం పెంచుతామని జగన్ ప్రకటించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం లక్షలాది మంది రైతులకు ఆసరాగా మారనుంది.
మరో మూడు నెలల్లో..
రాష్ట్రంలో మరో మూడు నెలల్లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నవరత్నాల అమలుతో ప్రజలకు సంక్షేమం చేరవవుతుంది. టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి.– కంబాల జోగులు,ఎమ్మెల్యే, రాజాం.
ఇది చరిత్ర
ఇచ్ఛాపురం చరిత్రలో నిలిచి పోతుంది. పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ చిరస్థాయిగా నిలిచి పోతాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై పూర్తి దృష్టి పెడుతుంది. తిత్లీ బాధిత రైతులను ఆదుకుంటుంది. –పిరియా సాయిరాజ్,ఇచ్ఛాపురం వైఎస్‌ఆర్ సీపీ సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే
జగన్ పేదల మనిషి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల మనిషి, పేద ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో ఉంది. రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నిం పారు. విద్య, వైద్యం, సంక్షేమం అన్ని రంగాల్లో ప్రగతికి కృషి చేస్తారు. – తమ్మినేని సీతారాం,పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
పాలనలో విఫలం
టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పాలనలో విఫలమైంది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. టీడీపీ నాయకులు ప్రజాధనం దోచుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.– పేరాడ తిలక్, టెక్కలి, సమన్వయకర్త
రాక్షస పాలనకు అంతం తప్పదు
ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాష్ట్రం రావణ కాష్టంగా ఉండేది. వైఎస్సార్ పాదయాత్రను విజయవంతం చేసి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మళ్లీ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ధర్మమైన ప్రజా తీర్పుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.
– దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త.
విజయం అందజేయాలి
సుమారు 14 నెలల పాటు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామ స్థాయిలో నవరత్నాలు, ఫ్యాన్ గుర్తుపై ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో జగనన్నకు సీఎం చేయాలి.– విశ్వాసరాయి కళావతి,ఎమ్మెల్యే, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment