తూర్పు గోదావరి/ జగ్గంపేట : చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను ఇచ్చి అన్ని కులాలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్ కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కాపులకు అన్యాయం జరిగిందని, వారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాను ఏదైనా మాట ఇస్తే.. దానికి కట్టుబడి ఉంటానని, చేయగలిగిందే తాను చెబుతానని, అబద్ధపు హామీలను ఇవ్వనని అన్నారు. 222వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిలా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని కాదని, అది కేంద్రం పరిధిలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భాలను ఆయన గుర్తుచేశారు. తాను మాట ఇస్తే నిలబెట్టుకొనితీరుతానని, చేయగలిగినదే చెప్తానని, కాపులకు అండగా ఉంటానని ఆయన తేల్చిచెప్పారు.
నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అరాచాకాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన గడ్డ జగ్గంపేట అని గుర్తుచేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూస్తే ప్రజలు భయపడుతున్నారని, జన్మభూమి కమిటీలతో మాఫీయా గుండాలకు తయారు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లు కొన్నారని అన్నారు. ఇసుక, మట్టిని దేనిని వదలకుండా 20నుంచి 30 కోట్లుకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నామని చెప్పారని, నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు.
‘కాపు రిజర్వేషన్లు కావాలని ప్రశ్నిస్తే. ముద్రగడ పద్మనాభంను నిర్భందించారు. ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు. చంద్రబాబు ఒక్కో కులానికి ఒక్కో పేపరు పెట్టుకుని అన్ని కులాలను మోసం చేశారు. బోయలను ఎస్టీలుగా, మత్స్యకారులను ఎస్టీలుగా, రజకులను ఎస్సీలుగా, కాపులను బీసీలుగా మారుస్తాం అని అబద్దపు హామీలను ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం ఒక్క పంటకైనా మద్దతు ధరును ప్రకటించారా. రైతుల దగ్గర పంటను చంద్రబాబు తక్కువ ధరకు కొని తన హెరిటేజ్ ఫ్రెష్‌లో మూడు రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. దళారీ వ్యవస్థను కట్టడిచేయాల్సిన ముఖ్యమంత్రే పెద్ద దళారీగా మారి ప్రజలను దోచుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు లాభాలు సంపాదించుకుంటుంటే, పంటలకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది.
జగ్గంపేట నియోజవర్గంలోని 90 చెరువుల నుంచి మట్టిని తవ్వి ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులను తీసుకుంటున్నారు. ఒక్కొ చెరువును తాటిచెట్టులోతు తవ్వి మట్టి మఫీయా చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు 19 వేల ఇళ్లలను కట్టించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనీసం ఊరికి ఒక్క ఇళ్లు అయిన కట్టించారా?. ఇంత దారుణమైన పాలన ఎక్కడాలేదు. జగ్గంపేటలో ప్రధాన ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మారుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిన కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి. 30 పడకల ఆసుపత్రిలో కేవలం 15 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిలో కనీసం ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నిషీయన్, అంబులెన్స్ కూడా లేదు. గతంలో జగ్గంపేట ప్రభుత్వ డిగ్రి కళాశాలకు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. చంద్రబాబు సీఎం అయి నాలుగేళ్లు అయినా కూడా ఇంకా పూర్తి కాలేదు.
చంద్రబాబు అధికారంలోని వచ్చాక అన్నింటిపై రేట్లను విపరీతంగా పెంచారు. కరెంట్‌పై, పెట్రోల్, డీజిల్, స్కూల్ ఫీజులపై బాదుడే బాదుడే. వైఎస్సార్ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యంతో సహా, కిరోసిన్, కందిపప్పు, వంటివి ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment