సాక్షి, శ్రీకాకుళం: సముద్ర తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలతో గ్రామాల్లోని తాగునీరు ఉప్పుగా మారుతోందని టి.శాసనంకు చెందిన మత్స్యకారులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆ నీటిని తాగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు. పరిహారం అందివ్వడంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మామిడిపల్లి, పలాస నియోజకవర్గ టీడీపీ, సీపీఎం నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని టీడీపీ నేతలు చెప్పారు. గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
పాదయాత్రలో వైఎస్ జగన్‌ను ఉల్లి రైతులు కలిశారు. ఉల్లి ధరలు గణనీయంగా పడిపోయి తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
పాదయాత్ర సాగే మార్గం..
ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 337వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గంలోని తురక శాసనం క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సోంపేట మండలంలోని పాలవలస, కొర్లాం, బారువకూడలి మీదుగా లక్కవరం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారు.
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తామూ భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment