
డొల్లతనం తేటతెల్లం: జ్యోతుల నెహ్రూ
ఏపీ మంత్రివర్గ భేటీపై వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం
రీషెడ్యూల్ అంటూ ఆర్బీఐపై నెపమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగిన తీరు ప్రభుత్వ డొల్లతనానికి, బేలతనానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలేవీ చర్చించకుండా భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
జ్యోతుల నెహ్రూ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీపై ప్రభుత్వం ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని, వ్యవసాయ రుణాల మాఫీ కోసం కేటాయింపులను ప్రస్తావిస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదన్నారు. రుణమాఫీ గురించి చెప్పకుండా రీషెడ్యూలు అంటూ రిజర్వ్ బ్యాంక్‌పై నెపం వేస్తున్నారని విమర్శించారు. గృహావసరాలకు 24 గంటలు, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.
- రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇవ్వకపోగా మరింత గందరగోళం సృష్టించారు. మంత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వారు విశాఖపట్టణం, ఒంగోలు, నెల్లూరులో రాజధాని ఉండాలని మాట్లాడుతున్నారు.
- వృద్ధులు, వితంతువులకు పింఛన్లు రూ.వెయ్యి, రూ.1500కి పెంచుతూ మంత్రివర్గం భేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశించినా అదేమీ జరగలేదు. అక్టోబర్ 2 నుంచి మీరు పెంచినా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచే పెరిగిన మొత్తాన్ని బకాయిలతో లబ్ధిదారులకు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.
- పార్టీ విప్‌ను ధిక్కరించారని ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుపై జిల్లా కలెక్టర్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికై, ప్రలోభాలకు గురై ఓట్లేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీలపై అనర్హత వేటు వేయరా? హరిబాబుకు ఓ న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? వైఎస్సార్ సీపీ విప్‌ను ధిక్కరించిన వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ అనర్హులను చేయలేదు. ప్రకాశం జడ్పీ ఎన్నిక కంటే 20 రోజుల మందే ఇవి జరిగాయి. ఇదీ చంద్రబాబు దుర్నీతి.