
కదనపథంలో జనదళమయ్యేలా..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం రాజీలేని పోరు కొనసాగించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల కూర్పు జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం రాజీలేని పోరు కొనసాగించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల కూర్పు జరుగుతోంది. పార్టీ జిల్లా కమిటీలకు నూతన జవసత్వాలు కల్పించే దిశగా చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాత, కొత్తల మేలు కలయికతో సమర్థవంతమైన కమిటీల ఏర్పాటు జరుగుతోంది. తొలి దశలో జిల్లా కమిటీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర కమిటీలోకి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించేందుకు జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ విషయమై గురువారం రాజమండ్రి షెల్టన్‌హోటల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు అంతర్గత సమావేశం నిర్వహించారు.
నలుగురు ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 38 మంది కార్యదర్శులు, 144 మందితో పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు కానుంది. ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్‌లు, ఇతర ముఖ్య నేతలు అందచేసిన జాబితాలపై నేతలు చర్చించారు. కమిటీ సభ్యుల ఎంపికలో ప్రాంతీయ, సామాజిక సమతూకాలు, సమర్థత, పార్టీ పట్ల అంకితభావం ప్రామాణికంగా కమిటీలకు తుది రూపమిస్తున్నారు. గతంలో వివిధ కమిటీల్లో సమర్థంగా పనిచేసిన వారిని రాష్ట్ర కమిటీల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు అందచేసిన జాబితాలపై వడపోత పూర్తిచేశారు. అనుబంధ కమిటీల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిలో కొందరిని కొనసాగించాలని, మిగిలిన వారి స్థానే ఆసక్తిగా ఉన్న కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అధినేత జగన్ చేపడుతున్న ఆందోళనలను జిల్లాస్థాయిలో సమర్థంగా కొనసాగించగలిగే వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల కన్వీనర్ల కోసం వచ్చిన జాబితాల్లో చేర్పులు, మార్పులపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి జిల్లా నుంచి ప్రాతినిధ్యం, జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కన్వీనర్లపై త్వరగా తుది ని ర్ణయం తీసుకుని అధినేత జగన్ ముందుంచాలని జిల్లా అధ్యక్షుడు నెహ్రూ నే తలకు సూచించారు. అధినేత ఆదేశాల మేరకు కమిటీల కూర్పును పూర్తిచేయాలన్నారు.
ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, ఎమ్మె ల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మలకుమారి, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ ఎస్సీ, యువజన, వాణిజ్య విభాగాల జిల్లా కన్వీనర్లు శెట్టిబత్తుల రాజబాబు, అనంత ఉదయబాస్కర్, కర్రి పాపారాయుడు, పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మో హన్, నక్కా రాజబాబు, ఆదిరెడ్డి వాసు, దాసరి శేషగిరి పాల్గొన్నారు.
131 ఘాట్ల వద్ద సీసీ కెమేరాలు
పి.గన్నవరం : జిల్లాలో 131 పుష్కరఘాట్ల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్టు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎస్.అప్పలనాయుడు చెప్పారు. బెల్లంపూడి, పి.గన్నవరాల్లోని ఘాట్లను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాట్లను ‘ఎ,బి,సి’ కేటగిరీలుగా విభజించి ఏర్పాట్లు చేస్తామన్నారు. 24 గంటలూ బందోబస్తు నిర్వహిస్తామని, పడవలు, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.