
సుహృద్భావ వాతావరణంలో సమీక్షలు
సాక్షి, రాజమండ్రి : ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయని జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. సమీక్షలు జరుగుతున్న స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల నాలుగు నుంచి జరుగుతున్న ఈ సమీక్షల్లో కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలోని నేతలు, కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, నరసాపురం నియోజకవర్గాలతో పాటు రాత్రి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమీక్ష జరుపుతారన్నారు. ప్రతీ కార్యకర్త నుంచి సూచనలు, సలహాలను తీసుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు జరపడానికి సమయం సరిపోలేదని, అందువల్ల విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు వాయిదా వేసినట్టు చెప్పారు. తిరుపతిలో మరికొన్ని జిల్లాల సమీక్షలు జరుగుతాయని, ఆ తర్వాత ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు విశాఖపట్నంలో నిర్వహిస్తారని నెహ్రూ తెలిపారు.
జగన్‌మోహన్‌రెడ్డి చేసిన దిశా నిర్దేశ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సమర్ధవంతమైన పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు ఉద్యుక్తం అవుతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని గ్రామస్థాయిలో ఎత్తిచూపి వాటి పరిష్కార దిశగా కార్యకర్తలు ఉద్యమిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కూడా పాల్గొన్నారన్నారు.