మాట తప్పడంలో మేటి
► సెజ్’పై హామీలకు చెల్లుచీటీ చంద్రబాబుపై జ్యోతుల ఆక్షేపణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికలకు ముందు ఒకలా చెప్పి, తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని మించినవారు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. సెజ్ భూముల్లో ఏరువాక సాగినప్పుడు, కాకినాడలో సెజ్ వ్యతిరేక సభలో ప్రకటనలు చేసి.. వాటిని మరచిపోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు.
వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పలువురు సెజ్ రైతులు సోమవారం మధ్యాహ్నం కాకినాడలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నెహ్రూను కలిశారు. సెజ్ కోసం భూములిచ్చిన తమకు ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన..రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
సర్కారు తీరు డొంకతిరుగుడు..
ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు నెహ్రూ సమాధానమిస్తూ.. ప్రభుత్వం ద్వంద్వ వైఖరివల్లే సెజ్ రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి రాతపూర్వకంగా సమాధానం కోరితే డొంకతిరుగుడుగా వచ్చిందని వెల్లడించారు.
‘సెజ్‌కోసం సేకరించిన భూముల రైతులకు సదరు భూమిలోని ప్రతి సెంటును తిరిగి ఇచ్చేయడం ద్వారా.. సేకరించిన భూముల్లో సేద్యం జరిగేటట్లు చూడడమవుతుందని’ 2012 ఏప్రిల్ 21న అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేశారా? అయితే ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవడమైందా? అయితే భూములను తిరిగి పొందిన రైతులు ఎంతమంది? అలా రైతులకు తిరిగి ఇచ్చేసిన భూవిస్తీర్ణం ఎంత? లేకపోతే ఎప్పటిలోగా సదరు భూములను రైతులకు తిరిగి ఇచ్చివేస్తారు?’ అని సభలో రాతపూర్వకంగా సమాధానం కోరినట్లు చెప్పారు.
దీనికి ‘21-04-2012న సభలో అప్పటి విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందన్నారు. తాము అడిగిన మిగతా మూడు ప్రశ్నలకు ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అనే సమాధానం వచ్చిందన్నారు.
జ్యోతులతో పాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గుత్తుల సాయి, అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జంపన సీతారామచంద్రవర్మ, ఫ్రూటీ కుమార్, శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి తదితరులు ఉన్నారు.