అపనమ్మకంతోనే విపక్షాన్ని తిడుతున్నారు
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం
టీడీపీ నేతలు తమను తాము పొగుడుకోవడానికే మహానాడు పరిమితమైందని ఎద్దేవా
హైదరాబాద్ : తన ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చే యలేనన్న అపనమ్మకంతోనే సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని విషయాల్లో చంద్రబాబు వ్యవహరించే తీరునే రాజధాని విషయంలోనూ ఊహాజనిత మాటలతో ప్రజల్ని మోసం చేయడంతప్ప ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద రాజధాని నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలకు వాటిని తాకట్టు పెట్టాలన్న బాబు ప్రభుత్వ ప్రయత్నాలపట్లే తమ పార్టీ తొలినుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.
ఈ విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మహానాడులాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే.. సాధారణంగా రాబోయే ఏడాది, రెండేళ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసే కార్యక్రమాలపై భవిష్యత్ ఎజెండాను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుందని, కానీ మహానాడు జరుగుతున్న తీరును చూస్తే తమను తాము పొగుడుకోవడానికే పరిమితమైందని తప్పుపట్టారు. చంద్రబాబు వారసుడి ఎంపికకు మహానాడును ఉపయోగించుకుంటున్నారేతప్ప ప్రజల అంశాలపై ఇందులో చర్చలు లేవని జ్యోతుల దుయ్యబట్టారు.