రైతురాజ్యం కాదిది
చంద్రబాబు ప్రభుత్వం రావణరాజ్యాన్ని తలపిస్తోందని దువ్వూరు, ముక్తాపురం గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఐదునెలలు పూర్తవుతున్నా ఒక్కరంటే ఒక్కరికి రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇంకా కమిటీల పేరుతో పింఛన్లు తొలగించడాన్ని తప్పుబట్టారు.
గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం లేదని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడం లేదని, ఎరువులను సైతం అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను అప్పుల పాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారి సంగం మండలం దువ్వూరు, ముక్తాపురం గ్రామాల్లో పర్యటించి ప్రజాసమస్యలను ఆవిష్కరించారు. ఆ వివరాలు యథాతథంగా ‘సాక్షి’ పాఠకుల కోసం....
గౌతమ్‌రెడ్డి: రైతుల పరిస్థితి ఎలా ఉంది. రుణాలు మాఫీ అయ్యాయా?
ఫణికుమార్,రైతుః లోన్లు తోసేస్తామన్నారు. అయితే పసుపుచొక్కాల వారికే అన్నీ చెందుతున్నాయి. పింఛన్లు కూడా వారికే ఇస్తున్నారు. అర్హులు అనర్హులుగా మారుతున్నారు.
గౌతమ్‌రెడ్డి: బ్యాంకులో రుణాలు, విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా?
రఘురామిరెడ్డి, రైతుసంఘం నాయకుడు: రైతులకు ఎలాంటి సాయం అందించలేదు. గతంలో రైతులందరికీ కులాలు, మతాలకతీతంగా మేలు జరిగింది. రుణాల మాఫీని అప్పట్లో వైఎస్సార్ ఒక్క కలం పోటుతో మాఫీ చేశారు. చంద్రబాబు వచ్చి ఐదునెలలు పూర్తై ఒక్కరికీ రుణం మాఫీ కాలేదు.
గౌతమ్‌రెడ్డి: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అయ్యాయా?
లక్ష్మీప్రసన్న, ఎంపీటీసీ: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసిందేమీ లేదు. వైఎస్సార్ హయాంలో అంతా బాగుపడ్డాం. అన్ని వర్గాలకు లోన్లు వచ్చాయి.
గౌతమ్‌రెడ్డి: ఇప్పటి వరకు లోన్లు మాఫీ చేయలేదు కదా? ఎప్పుడు చేస్తారనుకుంటున్నారు?
లక్ష్మి: లోన్లు తోసేస్తారనే ఆయన్ను గెలిపించాం.
గౌతమ్‌రెడ్డి: ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా?
లక్ష్మి: వర్షం వస్తే నీళ్లల్లో ఉంటున్నాం. గవర్నమెంటు స్థలం కూడా లేదు. మీరైనా స్థలం ఇప్పించి ఆదుకోండి సార్.
గౌతమ్‌రెడ్డి: ఏమ్మా.. నీపేరేమి?
గౌతమ్‌రెడ్డి: మీ సమస్యలు చెప్పండి.
వైకుంఠం వెంకటమ్మ: అందరికీ కాలనీలో ఇళ/్ల ఇచ్చారు. మాకు ఇవ్వలేదు.
గౌతమ్‌రెడ్డి: నీ పేరంటమ్మా?
గౌతమ్‌రెడ్డి: ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నావ్?
లక్ష్మమ్మ: పేదోళ్లకు లోన్లు ఇవ్వడం లేదు. ఉన్నోళ్లకే ఇస్తున్నారు. చంద్రబాబు న్యాయం చేయడం లేదు.
గౌతమ్‌రెడ్డి: మీ సమస్యలు చెప్పండి.
జె.వెంకటమ్మ: మాకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వంలోనైనా ఇల్లు కట్టించి ఇవ్వండి.
గౌతమ్‌రెడ్డి: మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?
ఇందిరమ్మ, దువ్వూరు సర్పంచ్: రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ చేయవచ్చని. ప్రజలకు మేలు చేయాలంటే గ్రామ సర్పంచ్‌కు మంచి అవకాశం ఉంటుందని కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి, భర్త వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. అందుకే వచ్చాను.
గౌతమ్‌రెడ్డి: సర్పంచ్‌గా 16 నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు?
సర్పంచ్: హరిజనవాడలో వీధులను విస్తరించి దారి వసతి కల్పించాను. అంతకుముందు వర్షం వస్తే వీధుల్లో నీళ్లు నిలబడేవి. నడవటానికి వీలుండేది కాదు.
గౌతమ్‌రెడ్డి: ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టారా?
సర్పంచ్: అన్ని వీధుల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశాను. ఇక్కడ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. రూ.3 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నాను.
గౌతమ్‌రెడ్డి: పంచాయతీ అభివృద్ధికి నిధులు ఉన్నాయా?
సర్పంచ్: లేవు. ఉన్న నిధులతో అభివృద్ధి చేస్తున్నాను.
గౌతమ్‌రెడ్డి: మీరు ఏం చేస్తుంటారు?
మల్లికార్జునరెడ్డి: వ్యవసాయం చేస్తుంటాను.
గౌతమ్‌రెడ్డి: మీకు సబ్సిడీ పథకాలు అందుతున్నాయా?
మల్లికార్జునరెడ్డి: ఎక్కడ సార్. కొన్ని ఇస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
గౌతమ్‌రెడ్డి: మీకు విత్తనాలు, ఎరువుల అందుతున్నాయా?
మల్లికార్జునరెడ్డి: వరి విత్తనాలు దొరకడం లేదు. రైతులు అడిగే విత్తనాలు ఇవ్వడం లేదు. వారు ఇచ్చే విత్తనాలనే నాటమంటున్నారు. ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. రైతుకు ఏదైతే అవసరం ఉంటుందో.. దాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.
గౌతమ్‌రెడ్డి: రుణమాఫీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది?
సుధాకర్‌రెడ్డి, సర్పంచ్: రుణమాఫీపై స్పందన లేదు. రుణాలు పోతాయని బ్యాంకుల్లో రుణం చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో 14 శాతం వడ్డీ అదనంగా పడుతోంది. రూ.13 వేల నుంచి రూ.20 వేలు అదనంగా చెల్లిం చాల్సి వస్తోంది.
గౌతమ్‌రెడ్డి: ఇది రామరాజ్యమేనా?
సర్పంచ్: ఇది రావణరాజ్యం
సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
నియోజక వర్గంలో పేరుకుపోయిన సమస్యలను తెలుసుకునేందుకు పల్లెబాట కార్యక్రమం పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నాను. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాను. అధికారులతో మా ట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. దువ్వూరు, ముక్తాపురం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను.