Naidu government
-
లక్ష ఉద్యోగాలు హుష్‌కాకి!
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబుకు ఓటేస్తే జాబు వస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అన్నారు. ఇలా ఎన్నికల ముందు నిరుద్యోగులను మురిపించారు. అపుడు ఎన్నో కాకమ్మ కథలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఓట్లేయించుకున్న తర్వాత ప్లేటు ఫిరాయించారు. క్రమబద్ధీకరణ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా రెండేళ్లు గడిపేశారు. ఇపుడు ప్రభుత్వఉద్యోగాల ఖాళీలపై మరో కథ సిద్ధం చేశారు. ఉన్న ఖాళీలను దాచిపెట్టి కొన్ని ఖాళీలను మాత్రమే చూపిస్తున్నారు. నిరుద్యోగులను మరోసారి బురిడీ కొట్టించడానికి లెక్కలు సిద్ధం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తమను మరోసారి మోసం చేయడానికి సిద్ధం కావడంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇపుడు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలపై కాకిలెక్కలతో నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది. ఒకపక్క దశల వారీగా 20 వేల ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతూ, మరోపక్క సుమారు లక్ష ఉద్యోగ ఖాళీలకు ఎసరు పెడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ గణాంకాలు సమర్పించింది. ఇందులో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలు కాగా అందులో 77,737 ఖాళీలున్నట్లు వివరించింది. ఈ ఖాళీల్లో 20 వేల వరకు దశలవారీగా భర్తీచేస్తామని పేర్కొంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 ఉద్యోగ ఖాళీలున్నట్లు ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీకి నివేదించింది. 2014 జూన్ 2 తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లకు పెంచడంతో ఆ గడువు తీరిన వారు ఈ జూన్‌లో దాదాపు 30 వేల మంది రిటైర్ కానున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం ఖాళీలు 1,72,825 అవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 77,737 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు చెబుతోంది. మరి విభజన తరువాత రాష్ట్రంలో ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల (1,72,825)లో మిగతా 95,088 పోస్టులు ఏమైనట్లు? ఎక్కడికి పోయినట్లు?. ఇపుడు ఇదే ప్రశ్న నిరుద్యోగుల్ని వేధిస్తోంది. ఇన్ని వేల ఖాళీలను ప్రభుత్వం కుదించి చూపించడంపై వారిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దశలవారీగా 20 వేల పోసుల భర్తీ ప్రకటనపైనా సందేహాలు నెలకొంటున్నాయి. ఎందుకంటే 10,313 టీచర్ పోస్టుల భర్తీకోసం 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు నిర్వహించి నెలలైనా ఇప్పటికి ఒక్కరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నియామకాలు న్యాయవివాదాల్లో ఇరుక్కునేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి భర్తీలు జరక్కుండా ఎత్తుగడ వేస్తోందని, ఇందుకు తార్కాణం 2014 డీఎస్సీనేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏమేరకు ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి? నియామకాల ఉత్తర్వుల జారీ వరకు ప్రక్రియ నడుస్తుందా? అనేది ప్రశ్నార్థకమేనని చెబుతున్నారు. నిరాశలో నిరుద్యోగులు.. పొరుగురాష్ట్రం తెలంగాణలో నోటిఫికేషన్లు వరుసగా వస్తుంటే.. ఏపీలో విభజన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. నిరుద్యోగుల్లో నిరాశ పెరిగిపోతోంది. లక్షకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకోసం బాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతోంది. మరోవైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వ అనుమతులకోసం ఏపీపీఎస్సీ నిరీక్షిస్తోంది. అనుమతులు రాగానే నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. అవసరం మేరకే భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినందున ఖాళీ పోస్టుల్లో ఏ మేరకు భర్తీకి అనుమతి లభిస్తుందనేది సందేహమే. ఖాళీల సంఖ్యను భారీగా కుదించడం ఇపుడు నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిమితంగానే భర్తీ.. పరిమితంగానే భర్తీ అని ప్రభుత్వం సంకేతాలిచ్చినందున.. చాలా తక్కువ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించే అవకాశాలున్నట్టు ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ మేరకు ముందుగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపవచ్చని అభిప్రాయపడుతున్నాయి. కమల నాథన్ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే గ్రూప్-1కు సంబంధించి 247 వరకు ఖాళీలున్నాయి. ఇవికాక ఆ తర్వాత ఖాళీ అయిన పోస్టులు మరిన్ని ఉన్నాయి. అయినా అవేవీ భర్తీ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. గ్రూప్-2లోనూ వేలాది పోస్టులున్నా 900 పోస్టుల భర్తీకే ప్రభుత్వం అనుమతించే వీలుందని, వైద్యుల పోస్టులు 400, సివిల్ ఇంజనీర్ పోస్టులు 500 వరకు భర్తీకి అనుమతి రావచ్చని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్-1లో 100, గ్రూప్-2లో 900 పోస్టుల వరకు భర్తీకి మాత్రమే అనుమతి రావచ్చంటున్నారు. అదే నిజమైతే లక్షలాది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు కుమ్మరించినట్టే అవుతుంది. సిలబస్‌లో మార్పులు.. అన్ని పోస్టుల భర్తీకి అనుమతి రావచ్చన్న ఉద్దేశంతో ఇటీవల గ్రూప్-1, గ్రూప్-2 , గ్రూప్-4 సిలబస్‌లో ఏపీపీఎస్సీ మార్పు చేయించింది. ఇప్పటికే మార్పులు చేసిన సిలబస్‌పై నిపుణుల నుంచి అభిప్రాయాలూ సేకరించింది. ఇందులో 1,236 మంది అభిప్రాయాలు తెలిపారు. మార్పులకు వీలుగా సిలబస్ రూపకల్పన కమిటీకి ఆ సూచనలు పంపించారు. కొద్దిరోజుల్లో సిలబస్‌లను ఏపీపీఎస్సీ ఖరా రు చేయనుంది. గ్రూప్-4 సిలబస్‌నూ సిద్ధం చేసినా ముందుగా పెరైండు గ్రూపుల సిలబస్‌లలో మార్పుల్ని ఖరారు చేయనున్నారు. వర్సిటీ పోస్టుల భర్తీకీ అడ్డంకులు యూనివర్సిటీల్లో 1,000 వరకు బోధనా సిబ్బంది పోస్టుల్ని భర్తీచేస్తామని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆర్థికశాఖ మాత్రం ఈ పోస్టులన్నిటికీ ఒకేసారి అనుమతి ఇవ్వట్లేదని సమాచారం. వీటిని మూడు దశల్లో భర్తీచేసుకోవాలని ఆర్థిక శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. వర్సిటీల వారీగా గతంలో చేసిన నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ప్రభుత్వం.. పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంటు బోర్డును ఏర్పాటుచేయాలని యోచి స్తోంది. దీనికి యూజీసీ అనుమతించే పరిస్థితి లేకపోవడంతో ఏపీపీఎస్సీ ద్వారా సెట్‌ను నిర్వహించి ఈ పోస్టుల్ని భర్తీచేయాలని నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగాలెన్ని? రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతనేదానిపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4,88,485గా చూపారు. అయితే గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలో మాత్రం 5,18,257 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. గ తేడాది లెక్కలతో పోల్చితే ఈ ఏడు 29,772 మంది తగ్గిపోయారు. తాజాగా కేబినెట్ సమావేశంలో ఆ సంఖ్యను 4.83 వేలకు కుదించారు. అదే సమయంలో కమలనాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6,97,621గా ఉండడం గమనించాల్సిన విషయం. -
ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు
అనంతపురం అగ్రికల్చర్ : చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు దగాకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌లను గుర్తించి స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) పేరుతో క్యూబిక్ మీటరు రూ.620 ప్రకారం అమ్మకాలు చేస్తుండంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడుతోందన్నారు. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక రూ.1600 నుంచి 1,700గానూ, టిప్పర్ ఇసుక రూ.5 వేల లోపు లభించే పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం వల్ల ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి రావాలంటే రూ.4 నుంచి రూ.4,500 గానూ టిప్పర్ ఇసుక అయితే రూ.10 నుంచి రూ.11 వేలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్క పరిగణలోకి తీసుకుంటే కిలో ఇసుక రూ.1 ప్రకారం అమ్ముతున్నారన్నారు. మరోపక్క కొందరు అధికార పార్టీ నాయకులు మాఫీయాగా ఏర్పడి ఇసుకను పక్క జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తూ రోజుకు రూ.8 నుంచి 10 లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో సారాయి మంచి ఆదాయ వనరుగా చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇసుకపై దృష్టి సారించారని విమర్శించారు. టీడీపీ అమలు చేస్తున్న ఇసుక విధానం వల్ల ట్రాక్టర్లు కొన్న రైతులు ఎక్కడైనా మట్టి లేదా ఇసుకను తరలించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. రెండు మూడు నెలల పాటు వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు ఆ తరువాత ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. కనీసం కంతులు కట్టడానికి కూడా అవకావం లేకుండా పోయిందన్నారు. మరోపక్క కూలీలకు కూడా ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఇక రైతులు, మహిళల కష్టాలు ఎంత చెప్పినా తక్కువేనన్నారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న చంద్రబాబు సీఎం కాగానే ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయకుండా దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల రుణాలు రూ.6 వేల కోట్లకు పైగా ఉండగా తొలివిడత అంటూ రూ.780 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. వడ్డీమీద వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ అన్ని నెత్తిన వేస్తే తీసుకున్న రుణాలకు చంద్రబాబు చేసిన మాఫీ వడ్డీకి సరిపోయే పరిస్థితి లేదన్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా డ్రిప్ ఇవ్వకుండా ప్రచారంలో మాత్రం అంత ఇంత అంటూ చెబుతున్నారని మండిపడ్డారు. 2013-14కు సంబంధించి రూ.643 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ, రూ.227 కోట్ల వాతావరణ బీమా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రుణమాఫీ నేపథ్యంలో ఈఏడాది పంట పూర్తిగా దెబ్బతిన్నా వాతావరణ బీమా కింద పైసా రాని దుస్థితి కల్పించారని విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరాకు పంట నష్టానికి రూ.10 వేల చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాట మరచిపోయారన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పూర్తీగా నిరుగార్చేశారన్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరుబాట చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అన్ని పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించినట్లు తెలిపారు. -
రైతురాజ్యం కాదిది
చంద్రబాబు ప్రభుత్వం రావణరాజ్యాన్ని తలపిస్తోందని దువ్వూరు, ముక్తాపురం గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఐదునెలలు పూర్తవుతున్నా ఒక్కరంటే ఒక్కరికి రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇంకా కమిటీల పేరుతో పింఛన్లు తొలగించడాన్ని తప్పుబట్టారు. గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం లేదని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడం లేదని, ఎరువులను సైతం అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను అప్పుల పాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారి సంగం మండలం దువ్వూరు, ముక్తాపురం గ్రామాల్లో పర్యటించి ప్రజాసమస్యలను ఆవిష్కరించారు. ఆ వివరాలు యథాతథంగా ‘సాక్షి’ పాఠకుల కోసం.... గౌతమ్‌రెడ్డి: రైతుల పరిస్థితి ఎలా ఉంది. రుణాలు మాఫీ అయ్యాయా? ఫణికుమార్,రైతుః లోన్లు తోసేస్తామన్నారు. అయితే పసుపుచొక్కాల వారికే అన్నీ చెందుతున్నాయి. పింఛన్లు కూడా వారికే ఇస్తున్నారు. అర్హులు అనర్హులుగా మారుతున్నారు. గౌతమ్‌రెడ్డి: బ్యాంకులో రుణాలు, విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా? రఘురామిరెడ్డి, రైతుసంఘం నాయకుడు: రైతులకు ఎలాంటి సాయం అందించలేదు. గతంలో రైతులందరికీ కులాలు, మతాలకతీతంగా మేలు జరిగింది. రుణాల మాఫీని అప్పట్లో వైఎస్సార్ ఒక్క కలం పోటుతో మాఫీ చేశారు. చంద్రబాబు వచ్చి ఐదునెలలు పూర్తై ఒక్కరికీ రుణం మాఫీ కాలేదు. గౌతమ్‌రెడ్డి: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అయ్యాయా? లక్ష్మీప్రసన్న, ఎంపీటీసీ: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసిందేమీ లేదు. వైఎస్సార్ హయాంలో అంతా బాగుపడ్డాం. అన్ని వర్గాలకు లోన్లు వచ్చాయి. గౌతమ్‌రెడ్డి: ఇప్పటి వరకు లోన్లు మాఫీ చేయలేదు కదా? ఎప్పుడు చేస్తారనుకుంటున్నారు? లక్ష్మి: లోన్లు తోసేస్తారనే ఆయన్ను గెలిపించాం. గౌతమ్‌రెడ్డి: ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? లక్ష్మి: వర్షం వస్తే నీళ్లల్లో ఉంటున్నాం. గవర్నమెంటు స్థలం కూడా లేదు. మీరైనా స్థలం ఇప్పించి ఆదుకోండి సార్. గౌతమ్‌రెడ్డి: ఏమ్మా.. నీపేరేమి? గౌతమ్‌రెడ్డి: మీ సమస్యలు చెప్పండి. వైకుంఠం వెంకటమ్మ: అందరికీ కాలనీలో ఇళ/్ల ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. గౌతమ్‌రెడ్డి: నీ పేరంటమ్మా? గౌతమ్‌రెడ్డి: ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నావ్? లక్ష్మమ్మ: పేదోళ్లకు లోన్లు ఇవ్వడం లేదు. ఉన్నోళ్లకే ఇస్తున్నారు. చంద్రబాబు న్యాయం చేయడం లేదు. గౌతమ్‌రెడ్డి: మీ సమస్యలు చెప్పండి. జె.వెంకటమ్మ: మాకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వంలోనైనా ఇల్లు కట్టించి ఇవ్వండి. గౌతమ్‌రెడ్డి: మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఇందిరమ్మ, దువ్వూరు సర్పంచ్: రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ చేయవచ్చని. ప్రజలకు మేలు చేయాలంటే గ్రామ సర్పంచ్‌కు మంచి అవకాశం ఉంటుందని కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి, భర్త వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. అందుకే వచ్చాను. గౌతమ్‌రెడ్డి: సర్పంచ్‌గా 16 నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? సర్పంచ్: హరిజనవాడలో వీధులను విస్తరించి దారి వసతి కల్పించాను. అంతకుముందు వర్షం వస్తే వీధుల్లో నీళ్లు నిలబడేవి. నడవటానికి వీలుండేది కాదు. గౌతమ్‌రెడ్డి: ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టారా? సర్పంచ్: అన్ని వీధుల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశాను. ఇక్కడ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. రూ.3 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నాను. గౌతమ్‌రెడ్డి: పంచాయతీ అభివృద్ధికి నిధులు ఉన్నాయా? సర్పంచ్: లేవు. ఉన్న నిధులతో అభివృద్ధి చేస్తున్నాను. గౌతమ్‌రెడ్డి: మీరు ఏం చేస్తుంటారు? మల్లికార్జునరెడ్డి: వ్యవసాయం చేస్తుంటాను. గౌతమ్‌రెడ్డి: మీకు సబ్సిడీ పథకాలు అందుతున్నాయా? మల్లికార్జునరెడ్డి: ఎక్కడ సార్. కొన్ని ఇస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గౌతమ్‌రెడ్డి: మీకు విత్తనాలు, ఎరువుల అందుతున్నాయా? మల్లికార్జునరెడ్డి: వరి విత్తనాలు దొరకడం లేదు. రైతులు అడిగే విత్తనాలు ఇవ్వడం లేదు. వారు ఇచ్చే విత్తనాలనే నాటమంటున్నారు. ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. రైతుకు ఏదైతే అవసరం ఉంటుందో.. దాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. గౌతమ్‌రెడ్డి: రుణమాఫీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? సుధాకర్‌రెడ్డి, సర్పంచ్: రుణమాఫీపై స్పందన లేదు. రుణాలు పోతాయని బ్యాంకుల్లో రుణం చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో 14 శాతం వడ్డీ అదనంగా పడుతోంది. రూ.13 వేల నుంచి రూ.20 వేలు అదనంగా చెల్లిం చాల్సి వస్తోంది. గౌతమ్‌రెడ్డి: ఇది రామరాజ్యమేనా? సర్పంచ్: ఇది రావణరాజ్యం సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే నియోజక వర్గంలో పేరుకుపోయిన సమస్యలను తెలుసుకునేందుకు పల్లెబాట కార్యక్రమం పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నాను. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాను. అధికారులతో మా ట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. దువ్వూరు, ముక్తాపురం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను.