అనంతపురం అగ్రికల్చర్ : చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు దగాకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌లను గుర్తించి స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) పేరుతో క్యూబిక్ మీటరు రూ.620 ప్రకారం అమ్మకాలు చేస్తుండంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడుతోందన్నారు.
గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక రూ.1600 నుంచి 1,700గానూ, టిప్పర్ ఇసుక రూ.5 వేల లోపు లభించే పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం వల్ల ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి రావాలంటే రూ.4 నుంచి రూ.4,500 గానూ టిప్పర్ ఇసుక అయితే రూ.10 నుంచి రూ.11 వేలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్క పరిగణలోకి తీసుకుంటే కిలో ఇసుక రూ.1 ప్రకారం అమ్ముతున్నారన్నారు.
మరోపక్క కొందరు అధికార పార్టీ నాయకులు మాఫీయాగా ఏర్పడి ఇసుకను పక్క జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తూ రోజుకు రూ.8 నుంచి 10 లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో సారాయి మంచి ఆదాయ వనరుగా చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇసుకపై దృష్టి సారించారని విమర్శించారు. టీడీపీ అమలు చేస్తున్న ఇసుక విధానం వల్ల ట్రాక్టర్లు కొన్న రైతులు ఎక్కడైనా మట్టి లేదా ఇసుకను తరలించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.
రెండు మూడు నెలల పాటు వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు ఆ తరువాత ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. కనీసం కంతులు కట్టడానికి కూడా అవకావం లేకుండా పోయిందన్నారు. మరోపక్క కూలీలకు కూడా ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఇక రైతులు, మహిళల కష్టాలు ఎంత చెప్పినా తక్కువేనన్నారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న చంద్రబాబు సీఎం కాగానే ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయకుండా దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు.
వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల రుణాలు రూ.6 వేల కోట్లకు పైగా ఉండగా తొలివిడత అంటూ రూ.780 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. వడ్డీమీద వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ అన్ని నెత్తిన వేస్తే తీసుకున్న రుణాలకు చంద్రబాబు చేసిన మాఫీ వడ్డీకి సరిపోయే పరిస్థితి లేదన్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా డ్రిప్ ఇవ్వకుండా ప్రచారంలో మాత్రం అంత ఇంత అంటూ చెబుతున్నారని మండిపడ్డారు.
2013-14కు సంబంధించి రూ.643 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.227 కోట్ల వాతావరణ బీమా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రుణమాఫీ నేపథ్యంలో ఈఏడాది పంట పూర్తిగా దెబ్బతిన్నా వాతావరణ బీమా కింద పైసా రాని దుస్థితి కల్పించారని విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరాకు పంట నష్టానికి రూ.10 వేల చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాట మరచిపోయారన్నారు.
ఉపాధిహామీ పథకాన్ని పూర్తీగా నిరుగార్చేశారన్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరుబాట చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అన్ని పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించినట్లు తెలిపారు.
ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు
Published Mon, Jan 5 2015 2:57 AM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM
Advertisement
Advertisement