సాక్షి, కడప : రుణమాఫీ వర్తించక కొందరు అల్లాడుతుంటే, మాఫీ.. మాయతో మరికొందరు అల్లాడుతున్నారు. కౌలు రైతుకు రుణమాఫీలో చాలావరకు ఎగనామం పెట్టిన ప్రభుత్వం రూ.50 వేల లోపు రుణం ఉన్న వారికి ఏదో రూ. 2-3 వేలతో సరిపెట్టింది. మరికొంతమంది బంగారు రుణం తీసుకుంటే అసలుకే ఎసరు పెట్టింది. కుటుంబానికి అంతా కలిపి రూ. 1.50 లక్షలు అన్నారు. మాఫీకి అఫిడవిట్ అన్నారు.
ఇలా ఎన్నో ఆంక్షలు పెడుతూ మాఫీకి కోత పెడుతున్న టీడీపీ సర్కార్ ఏకంగా వింత లీలలకు చోటు కల్పిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో కాదు.. బయటికి రాని చాలామంది ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలో 5.82 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ, అనుబంధ రుణాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పలు రకాల లిటిగేషన్లు పెట్టి 2.86 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. దీనికిగాను రూ. 314 కోట్లు మాఫీ కింద జమ చేస్తామని హామీ ఇచ్చారు.
ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు చిన్న ఓబులేశు. సిద్దవటం మండలం జ్యోతి గొల్లపల్లెకు చెందిన రైతు. ఈయన 2011 నవంబరు 11వ తేదీన చనిపోయారు. ఈయన పేరుపై రుణం ఉంది. తనకున్న 75 సెంట్ల భూమికి సంబంధించిన పాసు పుస్తకం సిద్దవటం ఎస్‌బీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి వరి పంటపై రూ. 20 వేల రుణం తీసుకున్నారు. దానికి వడ్డీ కూడా రూ.8162 అయింది. అయితే, ఈ రైతు చనిపోవడం వల్ల ఆధార్ కార్డు లేదు. బ్యాంకు, రెవెన్యూ అధికారులకు డెత్ సర్టిఫికెట్ సమర్పించారు.
వివరాలు తెలియజేసి భార్య సారెమ్మ పేరు మీద ఉన్న ఆధార్‌కార్డును జత చేశారు. కానీ ప్రభుత్వం ఆధార్‌కార్డు లింక్ కావడం లేదని తేల్చింది. ప్రస్తుతం రుణమాఫీ జాబితాలో రైతు పేరు లేకపోవడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం మృతుని కుమారుడు మహేష్ ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బ్యాంకు, రెవెన్యూ, మీ-సేవా ఇలా అన్ని సెంటర్ల చుట్టూ తిరిగారు. కానీ రుణమాఫీ కాకపోవడంతో ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సూర్యనారాయణ. ఈయనకు పులివెందుల మండలం పోలేపల్లె పంచాయతీలో 8.11 ఎకరాల భూమి ఉంది. వేరుశనగ పంటకు సంబంధించి పులివెందుల ఎస్‌బీఐ బ్యాంకులో పాసు పుస్తకం పెట్టి 2013లో రూ. లక్ష రుణం తీసుకున్నారు. అకౌంట్ నెంబర్ 11146289663. వడ్డీ కూడా దాదాపు రూ. 12 వేల పైచిలుకు అయింది.
ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పుస్తకంతోపాటు అన్నీ సమర్పించారు. కానీ, మొదటి రుణమాఫీ జాబితాలో సూర్యనారాయణ పేరు గల్లంతైంది. విచిత్రమేమిటంటే ఈయన బంగారంపై రుణమే తీసుకోలేదు. కానీ, బంగారు రుణానికి సంబంధించి మాఫీ అయినట్లు రావడం ఆయనను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెంటనే బ్యాంకు అధికారులను అడిగితే ఏదో వచ్చింది..మళ్లీ సవరణల్లో పోతుందో ఏమో అని అంటున్నారని రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు.
ఈమె పేరు కేసు చెన్నమ్మ. ఈమెకు 4.52 ఎకరాల పొలం ఒకచోట, 3.28 ఎకరాలు ఇంకోచోట ఉంది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన చెన్నమ్మ ఆంధ్రాబ్యాంకులో పంట రుణంతో బంగారుకు సంబంధించి రూ. 1.99 లక్షల రుణాన్ని తీసుకుంది. అయితే రుణమాఫీ పత్రంలో మాత్రం చెన్నమ్మ స్వగ్రామం ఊటుకూరు కాకుండా బుగ్గలేటిపల్లె అని ఇచ్చి రుణమాఫీ వర్తించలేదని స్పష్టంగా తెలిపారు.
దీంతో ఆమె లబోదిబోమంటోంది. పైగా వడ్డీమాత్రం దాదాపు రూ. 10 వేల పైచిలుకు అయినట్లు పేర్కొంటున్నారు. అన్ని అర్హతలున్నా రుణమాఫీ మాత్రం కాకపోవడంతో ఆమె ఆందోళన చెందుతోంది. టికేషన్లు పెట్టి 2.86 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. దీనికిగాను రూ. 314 కోట్లు మాఫీ కింద జమ చేస్తామని హామి ఇచ్చారు.
మాఫీ..ఏమాయే!
Published Thu, Jan 8 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM
Advertisement
Advertisement