నట్టేట ముంచిన చంద్రబాబు
- రుణమాఫీ పేరుతో వంచన
- అధికారం కోసమే దొంగ హామీలు
- అమలు చేయాల్సిందే
- జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి
తోట్లవల్లూరు : రుణమాఫీ పేరుతో సీఎం నారా చంద్రబాబునాయుడు రైతులను, మహిళలను నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రుణమాఫీ ఓ పెద్దడ్రామాలా కనబడుతుందన్నారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్‌కు కూడా ససేమిరా అంటుంటే టీడీపీ నేతలు మాత్రం రీషెడ్యూల్ అని ఒకరోజు, మాఫీ చేస్తామంటూ మరొక రోజు అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన అనివార్యమని, కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఉంటుందని తెలిసి కూడా అధికారమే పరమావధిగా బాబు ఎన్నికల్లో రుణమాఫీ హామీలను ఇచ్చారన్నారు. మోడీతో నిధులు రాబట్టుకుందామనుకున్న బాబుకు అక్కడా నిరాశ తప్పడం లేదన్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా రైతులను రుణాలే చెల్లించేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని, అమలు చేయలేని హామీలు ఎందుకిచ్చారో వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు.
రైతులు రుణాలు చెల్లించే పరిస్థితి ఉంటే రుణమాఫీ కోసం ఎందుకు ఎదురుచూస్తారని పద్మావతి మంత్రిని ప్రశ్నించారు. రుణమాఫీ సాధ్యం కాదనే ద్దేశంతోనే జననేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే 7 శాతం వడ్డీతో సరిపోయేదని, ఇప్పుడు బ్యాంకులు 13 శాతం వడ్డీని వసూలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలని ఆమె చంద్రబాబును నిలదీశారు. త్వరలోనే రైతులు, డ్వాక్రా మహిళల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని పద్మావతి చెప్పారు. రుణమాఫీని వెంటనే అమలుచేసి రైతుల్ని, మహిళల్ని రుణవిముక్తుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్.కోటేశ్వరావు, సోలే నాగరాజు పాల్గొన్నారు.