బ్రాందీ, విస్కీ, ఇసుక మరియు మట్టి Brandy, whiskey, sand and clay | Sakshi
Sakshi News home page

బ్రాందీ, విస్కీ, ఇసుక మరియు మట్టి

Published Sat, Mar 14 2015 12:12 AM | Last Updated on Fri, Mar 22 2019 6:28 PM

బ్రాందీ, విస్కీ, ఇసుక మరియు మట్టి - Sakshi

రుణమాఫీ ప్రస్తావన రెండు బడ్జెట్‌లు తీసుకురాలేదు. ఇది పచ్చి దగా అంటున్నాయి ప్రతిపక్షులు. ప్రతివారూ ఒక్క నిజం గ్రహించాలి. పార్టీ మేనిఫెస్టోలు ఉత్తమస్థాయి కాల్పనిక సాహిత్యమని గ్రహించాలి.
 
హమ్మయ్య! ఒక పని అయిపోయింది.
తెలుగు బ్రదర్స్ బడ్జెట్ పాఠాలు వినిపించడం విజయ వంతంగా పూర్తయింది. ప్రతి ఏటా మార్చిలో ఇదొక జాతర. బడ్జెట్‌లో అంకెలు చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంటుం ది సామాన్యుడికి. అయితే, మనం ఎన్నుకున్న మన సర్కార్లు ఈ ఏడాది ఖర్చు చేసే సొమ్ము లక్షా పదిహేను వేల కోట్లు! పైగా ఏదో మొద్దంకెలు కాకుండా రూపాయి అణాపైసలతో సహా విడివిడిగా పద్దుల్ని చూసి నివ్వెరపోతుంటే, ‘‘ఏముందిరా! మన కుటుంబ లెఖ్ఖలు మనం వేసు కోమూ! ఇదీ అంతే!’’ అన్నాడు మా బాబాయ్. అస లు మా బాబాయ్‌కి ఏదీ ఆశ్చర్యంగా అనిపించదు. ‘‘పంట రైతులం. మనం ఏటా పప్పులకు ఇంత, ఉప్పులకింత, పండుగలకింత, ప్రయాణాలకింత అని అనుకుంటాం కదా! అన్నీ అనుకున్నట్టు జర గవు. పంట దిగుబళ్లు మన లెఖ్ఖల ప్రకారం ఉండవు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టుండి ఓ చిన్నపిల్ల పెద్దపిల్ల అవుతుంది. మూడో పిల్ల మళ్లీ పురిటికి వస్తుంది. బోరుబావి ఎండిపోతుంది. ఇలాగే సవా లక్ష అనుకోనివి మనకే ఉంటే, యనమలకి ఎన్ని ఉంటాయి పాపం!
 
అరవై ఏళ్ల నుంచి ఒకే మాట- ఇది పేదవాడి బడ్జెట్ అని. అయినా ఈ దరిద్రం దేనికంటే, అది మన ప్రార బ్ధం. చూడగా చూడగా మన రాష్ట్ర భవిష్యత్తు బ్రాందీ, విస్కీల మీద, ఇసుక మీద ఆధారపడి ఉండేటట్టుంది. తెలంగాణ ఫ్యూచర్ పూడిక మట్టి మీద కేంద్రీకృతమై ఉందని నిశ్చయమైపోయింది. లోపాయికారీగా అందిన సమాచారమేమంటే, మిషన్ కాకతీయ వాస్తుకి ముడి పడి తెరమీదకు వచ్చిందని! గ్రామానికి ఈశాన్య మూల పల్లం ఉండాలని, అది నీరు నిండిన తటాకమైతే ప్రశస్థ మని వాస్తు ఘోషిస్తోంది. నైజాం నవాబు 1945 తరు వాత చెరువుల్ని అలక్ష్యం చేశాడట. క్రమేపి మేటవేసి మెరకలైనాయి. దాంతో జలావాసాలు జనావాసాలుగా మారాయి. ఆ వాస్తు దెబ్బతోనే నైజాం రాజ్యాన్ని కోల్పో యాడట. అందుకే తెలంగాణ సర్కార్ ఈ మహో ద్యమానికి గడ్డ ఎత్తింది. పైగా ప్రయోజనం ఉభయ తారకం.
 
అన్నట్టు బడ్జెట్‌లో ఎన్ని దుక్కుల వర్షం కురిపిస్తారో స్పష్టంగా చెప్పలేదు. ఎంతమందిని అక్షరాస్యులని చేస్తారో సెలవియ్యలేదు. ఎందర్ని లక్షాధికారుల్ని చేయ నున్నారో అంకెలు ఇవ్వలేదు. ‘జాబు-బాబు’ మాట మర్చేపోయారు. ఒక్కసారిగా విజన్ 2050 కి మహా జంప్ చేశారు. ‘‘అప్పటికి చాలామంది రాలిపోతారు, అడిగేవాళ్లుండరు’’ అన్నాడు బాబాయ్. రుణమాఫీ ప్రస్తావన రెండు బడ్జెట్‌లు తీసుకురాలేదు. ఇది పచ్చి దగా అంటున్నాయి ప్రతిపక్షులు.

ప్రతివారూ ఒక్క నిజం గ్రహించాలి. పార్టీ మేనిఫెస్టోలు ఉత్తమ స్థాయి కాల్పనిక సాహిత్యమని గ్రహించాలి. ఆ సినిమా ఎందుకంత బాగా ఆడింది? మనదెందుకు ఆడలే దని ఆలోచన చేసుకోవాలి. అందులో కథ బావుంది, డైలాగులు అదిరాయి, పాటలు వినసొంపుగా ఉన్నాయి. మరింక ఆడకేంచేస్తుంది? అందుకని ఊరికే వాగ్దానాలు నెరవేర్చ లేదని వేష్ట పడకూడదు.

నన్ను గెలిపిస్తే సముద్రాలని మంచినీటి సము ద్రాలుగా మారుస్తానని అంటే ఎవరైనా నమ్మి ఓటే స్తారా? ఒకవేళ గెలిపిస్తే ఆ నాయకుడు ఏమంటాడో తెలుసా? ‘‘ఇట్లాంటి శుష్క వాగ్దానాలు నమ్మి మోస పోకండి. ప్రజారాజ్యంలో దగాపడద్దు తమ్ము లారా!’’ అని హెచ్చరించడానికే చేశానంటాడు. ప్రతి ఏటా ఈ వసంతరుతువులో గవర్నర్ ప్రసంగాన్ని తీర్చి దిద్దడం, బడ్జెట్ అంకెల్ని పూరించడం, వ్యతిరేకతల మధ్య గవర్నర్‌కి ధన్యవాదాలు చెప్పడం తప్పనిసరి విధి. కాదంటే తిథి.
 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement
 
Advertisement
 
Advertisement