బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..
తీవ్ర నిరాశ కలిగించింది
‘‘కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పేదలకు ఉపశమనంకోసం తీసుకున్న చర్యలేవీ లేవు. ఇది కార్పొరేట్ అనుకూల, పేదల వ్యతిరేక బడ్జెట్. రైతులు, గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్‌తో మేలు జరుగుతుం దని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నా, రైతుల రుణమాఫీపై ఊసు లేదు. మధ్యతరగతిలో కొన్ని వర్గాలను బుజ్జగించే ప్రయత్నం తప్ప బడ్జెట్‌లో పేదలు, దిగువ మధ్యతరగతికి ఎలాంటి ఊరట లేదు. – సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
తెలంగాణ పట్ల వివక్ష
‘‘ఇది అంకెల గారడీ బడ్జెట్. తెలంగాణకు తగినన్ని కేటాయింపులు చేయకుండా, ఆయా పథకాల్లో తగిన ప్రాధాన్యతనివ్వకుండా కేంద్రం వివక్ష చూపింది. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఆశించినా అది సాధ్యం కాలేదు. నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ఆశాభంగం కలిగింది. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు.’’
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
తెలంగాణకు తీవ్రమైన అన్యాయం
‘‘ఇది అంకెల గారడీ బడ్జెటే. సంప్రదాయాలకు భిన్నంగా రైల్వే బడ్జెట్‌ను, సాధారణ బడ్జెట్‌లో కలిపారు. దీని వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రైతులకు రూ.10 లక్షల కోట్ల రుణాలు ఇస్తామని ప్రకటించినా వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చే విషయంలో అనేక ఆంక్షలు పెడుతున్నాయి. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఎయిమ్స్‌ను తెలంగాణకు ఇవ్వకుండా గుజరాత్‌కు తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రం నుంచి ఎలాంటి హామీలు రాబట్టలేకపోయారు. ఇది పూర్తిగా టీఆర్‌ఎస్ వైఫల్యమే. – టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇది నూరు శాతం పేదల బడ్జెట్
‘‘బడ్జెట్ నూటికి నూరు శాతం పేదల సంక్షేమం కోసమే. 70 ఏళ్లలో ఇలాంటి బడ్జెట్‌ను ఎవరూ పెట్టలేదు. మహిళల సంక్షేమం, గ్రామాభివృద్ధికి పెద్ద పీటవేశారు. రైతుల ఆత్మ విశ్వాసం పెంచేలా ఉంది. రియల్ ఎస్టేట్‌పై ఆశలు పెరిగాయి. తెలంగాణ గ్రామాల అభివృద్ధికి అవకాశాలు పెరిగాయి.’’ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
ప్రతిసారీ తెలంగాణకు అన్యాయమే..
‘‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా బడ్జెట్‌లో చూపించకపోవడం అన్యాయం. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వకుండా ప్రధాని స్వరాష్ట్రానికి తీసుకెళ్లారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఎంత డబ్బు చేరిందనే వివరాలను జైట్లీ చెప్పలేదు. మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు..’’ – వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
పన్ను తగ్గింపుతో పరిశ్రమలకు లబ్ధి
‘‘కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పన్ను తగ్గించడం శుభపరిణామం. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయమున్న వారిపై పన్నును 5 శాతానికి తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది. తెలంగాణకు ఎయిమ్స్ కేటాయించకపోవడం నిరాశ కలిగించింది..’’ – టీఆర్‌ఎస్ ఎంపీ కవిత
వ్యవసాయానికి ఏమాత్రం సరిపోవు
‘బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు. పక్క దేశాలు కూడా బడ్జెట్‌లో 7 శాతం నిధులిస్తుంటే.. మన సర్కార్ మాత్రం పెడచెవిన పెడుతోంది. ఏడు శాతం ప్రకారం రూ. 1.40 లక్షల కోట్లు వ్యవసాయరంగానికి కేటాయించాల్సి ఉండగా.. అందులో సగం కూడా కేటాయించలేదు. పరిశోధనలు, వ్యవసాయ విద్యకు కేటాయింపులు పెద్దగా లేవు. ఇప్పటికీ బహుళజాతి సంస్థల పరిశోధనలపైనే ఆధారపడుతున్నాం’ – సారంపల్లి మల్లారెడ్డి, రైతు నాయకుడు
చేనేతకు దక్కని నిధులు
కేంద్ర బడ్జెట్‌లో చేనేతకు భారీ స్థాయిలో కేటాయింపులు జరుగుతాయని ఆశపడ్డ మాకు ఈసారి తీవ్ర నిరాశే మిగిలింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చేనేతకు కేవలం రూ.604 కోట్లతో సరిపెట్టడం బా«ధాకరమైన విషయం. ఈ బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఉంటే కొంత ఉపశమనం కలిగి ఉండేది. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి