ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి(పైల్ ఫోటో)
విజయవాడ : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది పూర్తిగా ఓట్ల గారడీ బడ్జెట్ అని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలోని చట్టబద్ధమైన హామీలకు కేటాయింపులే లేవన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం, విశాఖ-చెన్నైపారిశ్రామిక కారిడార్, విశాఖ రైల్వేజోన్ హామీలపై ప్రకటన ఉంటుందనుకున్న ప్రజలకు ఈసారీ నిరాశే ఎదురైందన్నారు.
కర్ణాటకలో ఎన్నికల దృష్ట్యా మెట్రో రైలుకు రూ.17 వేల కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ.11,500 కోట్లు అవసరం కాగా కేవలం రూ.385 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని, ప్రత్యేక హోదాను చంద్రబాబు అడగనేలేదని స్వయంగా బీజేపీ నేతలే చెప్పడం చూస్తుంటే..ఏపీకి బీజేపీ, టీడీపీలు ఇద్దరూ ఉమ్మడిగా ద్రోహం చేశారని స్పష్టం అవుతోందన్నారు.
16 నెలలుగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా, ముఖ్యమంత్రి తనకున్న అవినీతి, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టారని విమర్శించారు. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment