బడ్జెట్: ఫిబ్రవరి 1కే సుప్రీం పచ్చజెండా
Published Mon, Jan 23 2017 4:14 PM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM
న్యూఢిల్లీ : కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ను వాయిదావేయాలంటూ నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఎన్నికల అయిపోయేంత వరకు బడ్జెట్ను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ జే.ఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ ఓటర్లను ప్రభావితం చేస్తుందని తాము భావించడం లేదని బెంచ్ పేర్కొంది. కేంద్రం ఫిబ్రవరి1న ప్రవేశపెట్టాలనుకున్న 2017-18 బడ్జెట్ను ఏప్రిల్ 1న ప్రవేశపెట్టాలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్ ఎమ్.ఎల్ శర్మ పిల్ను దాఖలు చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ పోల్స్ అయిపోయేంత వరకు బడ్జెట్ను వాయిదా వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఎన్నికలయ్యేంత వరకు కేంద్రం ఎలాంటి ఉపశమన పథకాలను, ఫైనాన్సియల్ బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా చూడాలని పిల్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్తో కలిపి ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం జనవరి 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎన్నికల ప్రవర్తన నియామవళి కిందకు వస్తుందన్నారు. అయితే ఎం.ఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిల్ను సుప్రీంకోర్టును కొట్టివేసింది. బడ్జెట్కు సంబంధించిన లాంఛనాలన్నీ మార్చి 31వ తేదీ నాటికి పూర్తిచేసేందుకు బడ్జెట్ తేదీని నెలరోజులు ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.
Advertisement
Advertisement