బాబు మార్కు బడ్జెట్!
హద్దూ, అదుపూ లేకుండా ఇచ్చిన హామీలకూ... కళ్లముందున్న వాస్తవాలకూ పొంతన కుదరనప్పుడు జనం ముందు తప్పు ఒప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పారదర్శకంగా వ్యవహరించడం తప్ప మార్గం లేదు. అయితే, అందుకు చిత్తశుద్ధి ఉండాలి. అదిలేకపోబట్టే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భారీ గణాంకాల మాటున దాగవలసివచ్చింది. అందమైన మాటల వెనక వైఫల్యాలను కప్పెట్టే యత్నం చేయాల్సివచ్చింది.
ఒకపక్క లక్షా 13 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పరుస్తూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకుగానీ, అధికారంలోకొచ్చాక కురిపించిన వరాలకుగానీ ఆయన చోటివ్వలేకపోయారు. నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కూ, ఇప్పటికీ చంద్రబాబు సర్కారు సాధించిన పురోగతి ఏమైనా ఉంటే అది జనం తలసరి అప్పును అమాంతం పెంచడమే! ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి అప్పులు రూ. 1,29,264 కోట్లుంటే...వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 17,588 కోట్లు అప్పుతీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇదింకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.
ఎందుకంటే రూ. 12,000 కోట్ల వరకూ అప్పు తప్పదని నిరుడు అంచనావేసిన ప్రభుత్వం దాన్ని రూ. 20,000 కోట్లకు పెంచింది. ఈ అప్పులనైనా ఆస్తుల కల్పనకు ఖర్చుచేసి ఉంటే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉండేది. కానీ, ఎక్కువ భాగాన్ని రెవెన్యూ వ్యయానికే ఉపయోగిస్తున్నారు. పర్యవసానంగా పెరిగేవి అప్పులే. వాటిపై కట్టాల్సిన వడ్డీలే. కనుక ఈసారి ద్రవ్యలోటు రూ. 17,584 కోట్లుగా అంచనావేసినా చివరకు అది అంతకన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పులు చేయడంపై విధించిన 14వ ఆర్థిక సంఘం పరిమితులను కూడా మించిపోవడమంటే వ్యయంపై ప్రభుత్వానికి అదుపు లేకపోవడమే. పాలనలో సుదీర్ఘ అనుభవమున్నదని తరచు చెప్పుకునేవారు చేయాల్సిన పనేనా ఇది?!
అదనపు పన్నుల భారాన్ని మోపడం లేదంటూనే...వచ్చే ఏడాదిలో పన్నుల ద్వారా అదనంగా రూ. 7,000 కోట్లు వస్తుందని యనమల అంచనావేస్తున్నారు. ఈ అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ‘ఇతర మార్గాలు అన్వేషిస్తామ’నడం తప్ప ఏం చేయదల్చుకున్నదీ ఆయన చెప్పలేదు. పన్నుల రూపంలో మొత్తం రూ. 44,432 కోట్లు వస్తుందంటూనే వ్యాట్ పద్దులో రూ. 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా రూ. 1,000 కోట్లు, యూజర్ చార్జీల ద్వారా రూ. 500 కోట్లు అదనంగా రాగలవని మాత్రం ఆయన చూపారు. ఈ చూపిన మొత్తాలతో కలుపుకుని పన్నులు, చార్జీల ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూనే కొత్త పన్నులు ఉండబోవని చెప్పడం వంచన తప్ప మరేమీ కాదు. ఇక నిరుద్యోగ భృతి, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల పెంపు ఊసే లేదు. కొత్తగా మరో లక్షమందికి పింఛన్లు ఇస్తామని ఊదరగొట్టిన సర్కారు తీరా అమల్లో ఉన్నవాటికే అరకొర కేటాయింపులు చేసింది.
రైతుల రుణమాఫీ విషయంలో ఏదో అమలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం...డ్వాక్రా రుణాల విషయంలో ఆ మాత్రం కూడా మాట్లాడటం లేదు. ఆ ఊసెత్తకుండా దాని స్థానంలో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. అసలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో నియమించిన కమిటీ నివేదిక ఏమైందన్నది కూడా చెప్పలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రుణమాఫీ కూడా డిటోయే. చేనేత రుణమాఫీకి రూ. 168 కోట్లు అవసరమని అంచనా వేస్తే అందుకోసం కేటాయించిన మొత్తం అత్యంత స్వల్పం. ఇక చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో నిధి హామీ ఎటుపోయిందో తెలియదు.
ఇవి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల దుస్థితి. అధికారానికొచ్చాక ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసమని భూ సమీకరణ కింద రైతులనుంచి ‘స్వచ్ఛందంగా’ 33,000 ఎకరాలు తీసుకున్నామని ఘనంగా ప్రకటించినా వారికివ్వాల్సిన నష్టపరిహారం కోసం చేసిన కేటాయింపు రూ. 60 కోట్లు మాత్రమే! ఒకపక్క అంతర్జాతీయ శ్రేణి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటనలిస్తూ అందుకోసం కేటాయించింది రూ. 303 కోట్లు! తమ నిర్వాకమే ఇలావుంటే రాజధాని నిర్మాణానికి కేంద్రాన్ని అడగడం, సాధించడం సాధ్యమవుతుందా?!
వర్షాభావ పరిస్థితులనూ, హుద్‌హుద్ తుపానువంటి విలయాన్ని ఎదుర్కొని కూడా 5.9 శాతం వృద్ధిని నమోదుచేసిన వ్యవసాయరంగంపై ప్రభుత్వం శీతకన్నేసింది. శుక్రవారం రూ. 14,184 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌లో అధిక భాగం ప్రణాళికేతర వ్యయమే ఉంది. అదంతా జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉపాధి హామీ తదితరాలుండే ప్రణాళికా వ్యయానికి కేటాయింపులు తక్కువున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసమే ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ హామీ కాస్తా అటకెక్కిందని ఈ ప్రత్యేక బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది.
ఇక ఉచిత విద్యుత్‌కు రూ. 6,455 కోట్లు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరితే అందుకోసం ప్రభుత్వం కేటాయించింది రూ. 3,000 కోట్లు. కనుక ఉచిత విద్యుత్‌కు కోతపడుతుందన్నమాట! వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ రంగం ఎంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదో అర్థమవుతుంది. సమస్యలు లేవని కాదు...కొత్త రాష్ట్రం గనుక ఎన్నో పరిమితులూ, ఇబ్బందులూ ఉంటాయి. కానీ, ఆ సవాళ్లను ఎదుర్కొనడం తమకే సాధ్యమని కదా అధికారంలోకొచ్చింది! ఇప్పటికైనా వాస్తవాలను చెప్పి, వైఫల్యాలను అంగీకరించక భారీ లక్ష్యాలు, గణాంకాల వెనక దాగడం దేనికి?!