the state budget
-
ఇక వేగం పెంచండి
♦ నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం ♦ ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, డిండి పనులు ఏకకాలంలో జరగాలి ♦ మూడు, నాలుగే ళ్లలో కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళిక అమలు చేయాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయించినందున ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాణహిత, కాళేశ్వరం, శ్రీసీతారామ, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో జరగాలని సూచించారు. నిర్మాణంలోని ప్రాజెక్టులను సైతం త్వరితగతిన పూర్తి చేసి మూడు, నాలుగేళ్లలో కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళిక అమలు చేయాలన్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, సీఎస్ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారులు ఆర్.విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా చర్చించారు. గోదావరి నుంచి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల, మంచిప్ప ప్రాంతాల్లో నిర్మించనున్న రిజర్వాయర్లకు నీరు చేరే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ టన్నెళ్లు నిర్మించాలి, ఎక్కడ పంపింగ్ చేయాలి, ఎక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలి అనే అంశాలపై అధికారులు తయారు చేసిన నివేదికలను సీఎం పరిశీలించారు. గోదావరిలో నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న రోజే నీటిని పంప్ చేసి రిజర్వాయర్లు నింపుకోవాలని సూచించారు. దేవాదుల పంప్‌హౌస్ దిగువ భాగంలో బ్యారేజీ నిర్మించడం ద్వారా ఏడాది పొడవునా ప్రాజెక్టుకు నీరందుతుందని, దీని ద్వారా వరంగల్ జిల్లాలో చాలా వరకు భూమికి సాగునీరు అందించవచ్చని కేసీఆర్ తెలిపారు. తక్కువ ముంపు, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును ఉపయోగించుకునేలా బ్యారేజీ ఉండాలన్నారు. సాగునీటితోపాటు హైదరాబాద్ మంచినీటి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని... ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, నిజాం సాగర్, ఎస్సారెస్పీ, సింగూరు ప్రాజెక్టుల కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ‘వాటర్ వీక్’కు ఆహ్వానం ఢిల్లీలో ఏప్రిల్ 4న జరగనున్న వరల్డ్ వాటర్ వీక్ సదస్సుకు విచ్చేయాలంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతి సోమవారం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. ‘మిషన్ కాకతీయ’పై ప్రజెంటేష్న్ ఇవ్వాలని కోరారు. ఈ పథకానికి వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయిం చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతి నిధులు హాజరుకానున్నారు. -
బాబు మార్కు బడ్జెట్!
హద్దూ, అదుపూ లేకుండా ఇచ్చిన హామీలకూ... కళ్లముందున్న వాస్తవాలకూ పొంతన కుదరనప్పుడు జనం ముందు తప్పు ఒప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పారదర్శకంగా వ్యవహరించడం తప్ప మార్గం లేదు. అయితే, అందుకు చిత్తశుద్ధి ఉండాలి. అదిలేకపోబట్టే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భారీ గణాంకాల మాటున దాగవలసివచ్చింది. అందమైన మాటల వెనక వైఫల్యాలను కప్పెట్టే యత్నం చేయాల్సివచ్చింది. ఒకపక్క లక్షా 13 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పరుస్తూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకుగానీ, అధికారంలోకొచ్చాక కురిపించిన వరాలకుగానీ ఆయన చోటివ్వలేకపోయారు. నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కూ, ఇప్పటికీ చంద్రబాబు సర్కారు సాధించిన పురోగతి ఏమైనా ఉంటే అది జనం తలసరి అప్పును అమాంతం పెంచడమే! ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి అప్పులు రూ. 1,29,264 కోట్లుంటే...వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 17,588 కోట్లు అప్పుతీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇదింకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రూ. 12,000 కోట్ల వరకూ అప్పు తప్పదని నిరుడు అంచనావేసిన ప్రభుత్వం దాన్ని రూ. 20,000 కోట్లకు పెంచింది. ఈ అప్పులనైనా ఆస్తుల కల్పనకు ఖర్చుచేసి ఉంటే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉండేది. కానీ, ఎక్కువ భాగాన్ని రెవెన్యూ వ్యయానికే ఉపయోగిస్తున్నారు. పర్యవసానంగా పెరిగేవి అప్పులే. వాటిపై కట్టాల్సిన వడ్డీలే. కనుక ఈసారి ద్రవ్యలోటు రూ. 17,584 కోట్లుగా అంచనావేసినా చివరకు అది అంతకన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పులు చేయడంపై విధించిన 14వ ఆర్థిక సంఘం పరిమితులను కూడా మించిపోవడమంటే వ్యయంపై ప్రభుత్వానికి అదుపు లేకపోవడమే. పాలనలో సుదీర్ఘ అనుభవమున్నదని తరచు చెప్పుకునేవారు చేయాల్సిన పనేనా ఇది?! అదనపు పన్నుల భారాన్ని మోపడం లేదంటూనే...వచ్చే ఏడాదిలో పన్నుల ద్వారా అదనంగా రూ. 7,000 కోట్లు వస్తుందని యనమల అంచనావేస్తున్నారు. ఈ అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ‘ఇతర మార్గాలు అన్వేషిస్తామ’నడం తప్ప ఏం చేయదల్చుకున్నదీ ఆయన చెప్పలేదు. పన్నుల రూపంలో మొత్తం రూ. 44,432 కోట్లు వస్తుందంటూనే వ్యాట్ పద్దులో రూ. 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా రూ. 1,000 కోట్లు, యూజర్ చార్జీల ద్వారా రూ. 500 కోట్లు అదనంగా రాగలవని మాత్రం ఆయన చూపారు. ఈ చూపిన మొత్తాలతో కలుపుకుని పన్నులు, చార్జీల ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూనే కొత్త పన్నులు ఉండబోవని చెప్పడం వంచన తప్ప మరేమీ కాదు. ఇక నిరుద్యోగ భృతి, అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపు ఊసే లేదు. కొత్తగా మరో లక్షమందికి పింఛన్లు ఇస్తామని ఊదరగొట్టిన సర్కారు తీరా అమల్లో ఉన్నవాటికే అరకొర కేటాయింపులు చేసింది. రైతుల రుణమాఫీ విషయంలో ఏదో అమలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం...డ్వాక్రా రుణాల విషయంలో ఆ మాత్రం కూడా మాట్లాడటం లేదు. ఆ ఊసెత్తకుండా దాని స్థానంలో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. అసలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో నియమించిన కమిటీ నివేదిక ఏమైందన్నది కూడా చెప్పలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రుణమాఫీ కూడా డిటోయే. చేనేత రుణమాఫీకి రూ. 168 కోట్లు అవసరమని అంచనా వేస్తే అందుకోసం కేటాయించిన మొత్తం అత్యంత స్వల్పం. ఇక చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో నిధి హామీ ఎటుపోయిందో తెలియదు. ఇవి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల దుస్థితి. అధికారానికొచ్చాక ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసమని భూ సమీకరణ కింద రైతులనుంచి ‘స్వచ్ఛందంగా’ 33,000 ఎకరాలు తీసుకున్నామని ఘనంగా ప్రకటించినా వారికివ్వాల్సిన నష్టపరిహారం కోసం చేసిన కేటాయింపు రూ. 60 కోట్లు మాత్రమే! ఒకపక్క అంతర్జాతీయ శ్రేణి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటనలిస్తూ అందుకోసం కేటాయించింది రూ. 303 కోట్లు! తమ నిర్వాకమే ఇలావుంటే రాజధాని నిర్మాణానికి కేంద్రాన్ని అడగడం, సాధించడం సాధ్యమవుతుందా?! వర్షాభావ పరిస్థితులనూ, హుద్‌హుద్ తుపానువంటి విలయాన్ని ఎదుర్కొని కూడా 5.9 శాతం వృద్ధిని నమోదుచేసిన వ్యవసాయరంగంపై ప్రభుత్వం శీతకన్నేసింది. శుక్రవారం రూ. 14,184 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో అధిక భాగం ప్రణాళికేతర వ్యయమే ఉంది. అదంతా జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉపాధి హామీ తదితరాలుండే ప్రణాళికా వ్యయానికి కేటాయింపులు తక్కువున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసమే ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ హామీ కాస్తా అటకెక్కిందని ఈ ప్రత్యేక బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఉచిత విద్యుత్‌కు రూ. 6,455 కోట్లు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరితే అందుకోసం ప్రభుత్వం కేటాయించింది రూ. 3,000 కోట్లు. కనుక ఉచిత విద్యుత్‌కు కోతపడుతుందన్నమాట! వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ రంగం ఎంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదో అర్థమవుతుంది. సమస్యలు లేవని కాదు...కొత్త రాష్ట్రం గనుక ఎన్నో పరిమితులూ, ఇబ్బందులూ ఉంటాయి. కానీ, ఆ సవాళ్లను ఎదుర్కొనడం తమకే సాధ్యమని కదా అధికారంలోకొచ్చింది! ఇప్పటికైనా వాస్తవాలను చెప్పి, వైఫల్యాలను అంగీకరించక భారీ లక్ష్యాలు, గణాంకాల వెనక దాగడం దేనికి?! -
జగన్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు
బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన విపక్షనేత సాధికారిక లెక్కలతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన జగన్ తట్టుకోలేక జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ సభ్యులు వారు అడిగిన ప్రతిసారీ మైక్ ఇచ్చిన స్పీకర్ పదేపదే పాత ఆరోపణలే చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు గడువులోగా ముగించాలంటూ జగన్‌కు స్పీకర్ సూచనలు అంతరాయాలను పట్టించుకోని వైనం విపక్షనేత మాట్లాడుతుండగానే మైక్ కట్ వైఎస్సార్సీపీ నిరసన... అర్ధంతరంగా సభ వాయిదా హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం అధికార పక్షం నుంచి పలు అవాంతరాల మధ్య సాగింది. సోమవారం బడ్జెట్‌పై సాధారణ చర్చను జగన్ ప్రారంభించగా... అధికార పక్షం అవాంతరాల మధ్య అది పూర్తికాకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆధారాలతో సహా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న జగన్‌కు అధికార టీడీపీ సభ్యులు రెండు గంటల వ్యవధిలో అనేకసార్లు అడ్డు తగిలారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రతిసారీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వారికి మైక్ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని, హామీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించని వైనాన్ని విపక్ష నేత గట్టిగా వినిపిం చినప్పుల్లా.. టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించి ఇతర విషయాలను ప్రస్తావిస్తూ ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. గతంలో చేసిన దూషణల్నే మళ్లీ వినియోగించుకున్నారు. పలుమార్లు టీడీపీ సభ్యులు అంతరాయం కలిగిం చగా... విపక్షానికి ఇచ్చిన గడువులోగా ముగిం చాలని విపక్ష నేతకు స్పీకర్ పలుమార్లు సూచిం చారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, విపక్ష నేతగా అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వీలుగా తగిన సమయం ఇవ్వాలని, పరిమితి విధించవద్దని జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. పార్టీకి కేటాయించిన సమయా న్ని ఎలా వినియోగించుకోవాలనే అంశం పూర్తి గా పార్టీకి సంబంధించిన వ్యవహారమని జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మట్లాడొద్దని తాము సూచిస్తే అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. పార్టీలో మిగతా సభ్యులకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్‌కు స్పీకర్ సూచించారు. గడువు ముగిసిందని, వెంటనే ముగించాలంటూ స్పీకర్ పలుమార్లు కోరారు. పలు సందర్భాల్లో విపక్ష నేత మైక్ కట్ చేశారు. అలా చేసిన ప్రతిసారీ వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసిన తర్వాతే స్పీకర్ అవకాశం ఇచ్చారు. మంత్రి మాటలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ జగన్ మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... జలయజ్ఞంలో పందికొక్కుల్లా సర్కారు సొమ్ము తినేశారంటూ అనేక ఆరోపణలు చేశారు. దాంతో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం చుట్టుముట్టారు. దాంతో మంత్రి మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు. హామీలను అమలు చేయకుండా గత పదేళ్లలో రాష్ట్రం నాశనమైందంటూ గత ప్రభుత్వాల మీదకు నెపం నెట్టేసే చెప్పే ప్రయత్నాన్ని జగన్ తన ప్రసంగంలో ఎత్తిచూపుతూ... గత 30 సంవత్సరాల జీఎస్డీపీ లెక్కలను సభ ముందు ఉంచారు. చంద్రబాబు ముందు పదేళ్లు, తర్వాత పదేళ్ల జీఎస్డీపీ గణాంకాల ఆధారంగా ఆయా ప్రభుత్వాలకు మార్కులు ఇవ్వడం పట్ల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా, అధికారిక డాక్యుమెంట్ల నుంచే ఈ గణాంకాలు చెబుతున్నానని, అవసరమైతే పరిశీలించుకోవచ్చని జగన్ సమాధానం ఇచ్చారు. చర్చను ప్రారంభమైన తర్వాత నుంచి చివరకు సభ వాయిదా పడే సమయంవరకు అధికార పక్ష సభ్యులు పలుమార్లు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అవకాశం తీసుకొని.. శృతిమించిన ఆరోపణలు గుప్పించారు. రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించామని, ఎన్నికల హామీ నుంచి వెనక్కిపోమని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మేజర్లు అయితే ఇద్దరికీ రుణమాఫీ వర్తిస్తుందని, మైనర్లయితే ఒకరికే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు తెలిపారు. అర్ధాంతరంగా సభ వాయిదా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతుండగానే.. ఇచ్చిన గడువు ముగిసిందంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. బడ్జెట్‌పై చర్చలో టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తాను మాట్లాడుతున్నది పూర్తికాకముందే అధికార పార్టీ సభ్యుడికి అవకాశం ఇవ్వడంతో వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు పోడియం వద్ద నుంచి వెనక్కి వెళ్లాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు వినలేదు. మరోవైపు సూర్యారావు మాట్లాడుతూనే ఉన్నారు. సభలో గంధరగోళ పరిస్థితి నెలకొనడంతో మధ్యాహ్నం 1.45 గంటలకు సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. -
విపక్ష నేతను అడ్డుకోవడం దారుణం
అధికారపక్షంపై జగన్ విమర్శ ప్రతిపక్షమన్నది ప్రజల గొంతుక.. వినిపించేటప్పుడు అధికారపక్షం వినాలి బడ్జెట్‌పై నా ప్రసంగం ముగియకముందే అది పూర్తయినట్లు చెప్పడం సరికాదు.. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా అధికారపక్షం ప్రయత్నిస్తోంది వారే మాపై వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు దిగారు వాళ్లు ఎంత రెచ్చగొట్టినా నేను పూర్తిగా బడ్జెట్‌పై గణాంకాలతో మాట్లాడా మంత్రి యనమల ఈ అంశాన్ని లేవనెత్తడం, దానిని స్పీకర్ అనుమతించడం చూస్తే మంత్రి తానా అంటే స్పీకర్ తందానా అన్నట్లుంది చంద్రబాబు మాట్లాడేటప్పుడు మేం ఇలా అడ్డుతగిలితే వాళ్లు ఊరుకుంటారా? హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పై గణాంకాలు, ఆధారాలతో మాట్లాడుతుంటే అధికారపక్షానికి చెందిన మంత్రులు, సభ్యులు అడ్డుకోవడం దారుణమని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అన్నది ప్రజల గొంతుక అని, ప్రజల గొంతు వినిపించేటప్పుడు అధికారపక్షం వినాలని, ఆ సద్గుణం కూడా లేకపోతే ఇక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్లా... లేనట్లా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా ఒక వ్యూహం ప్రకారం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా బడ్జెట్‌పై తాను చర్చ మొదలుపెట్టి, అది ముగియక ముందే పూర్తయినట్లుగా చెప్పడం సరికాదని అన్నారు. తనకు తెలిసినంతవరకూ ఈ దేశంలో, రాష్ట్రంలోనూ ఎక్కడా ఇలా జరిగి ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం శాసన సభ వాయిదా పడిన తరువాత ఆయన తన చాంబర్లో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ‘‘బడ్జెట్‌పై చర్చకు నాకు కేటాయించిన సమయం 1.30 గంటలు. అయితే నా ప్రసంగం ముందుకు సాగకుండా అధికారపక్షానికి చెందిన మంత్రులు, చీఫ్ విప్, ఇతర సభ్యులు అనేకసార్లు అడ్డుతగిలారు. 52నిమిషాల పాటు అడ్డు కున్నారు. పోనీ నేనేమైనా అభ్యంతరకరంగా మాట్లాడానా.., వ్యక్తిగత విమర్శలు చేశానా అంటే అదీ లేదు. వాళ్లు (అధికారపక్షం) మాత్రం తడవతడవకూ వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకూ దిగారు. వాళ్లు ఎంత రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శించినా నేను బడ్జెట్ విషయాల నుంచి పక్కకు మళ్లలేదు. నేను పూర్తిగా విషయానికే పరిమితమవుతూ నా దగ్గర ఉన్న గణాంకాలు, ఆధారాలతోనే మాట్లాడుతూ వచ్చాను. పూర్తిగా సబ్జెక్ట్ పైనే మాట్లాడాను. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులెంత? అధికారపక్షం గతంలో చేసిన హామీలేమిటి అన్నవాటిపై కూడా ఆధారసహితంగా మాట్లాడాను. వాళ్లు అంతరాయం కలిగించి మాట్లాడిన 14 సార్లూ వ్యక్తిగత విమర్శలకే దిగారు. రెచ్చగొట్టడానికి ఏమేమో చేశారు. వాళ్లు మమ్మల్ని పందికొక్కులు అన్నా మేం మౌనం వహించాం’’ అని చెప్పారు. స్పీకర్ వారు మాట్లాడిన మాటలన్నింటినీ అనుమతించారని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు మాట్లాడేటప్పుడు మేం ఇలా అడ్డుతగిలితే వాళ్లు ఊరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ‘‘మా పార్టీలో ఎవరు ఎంతసేపు మాట్లాడాలి, మా పార్టీకి కేటాయించిన మొత్తం సమయంలో ఒకరే మాట్లాడతారా లేక ఎక్కువ మంది మాట్లాడతారా అనేది పూర్తిగా మా పార్టీ అభీష్టం ప్రకారమే జరుగుతుంది. అలా కాకుండా అధికారపక్షం నిర్దేశించడం ఏమిటి? మా పార్టీలో ఏం జరగాలో ఇంకొక పార్టీ చెబితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి ఈ అంశాన్ని లేవనెత్తడం, దానిని స్పీకర్ అనుమతించడం చూస్తే మంత్రి తానా అంటే స్పీకర్ తందానా అన్నట్లుంది’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌ను ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారనే విమర్శ ఉందని విలేకరులు అనగా.. ‘‘మేం ప్రభావితం చేయడంలేదు. ఆయనే ప్రభావితమయ్యారు. టీవీలు చూసే వారెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. నేనేమైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానేమో రికార్డులు చూసి చెప్పమనండి. చాలా ఓపిగ్గా చిరునవ్వుతోనే సహించాం’’ అని ఆయన బదులిచ్చారు. -
వైఎస్సార్ సీపీ నేతలను చంపడం ఆటవిక చర్య
రుణమాఫీపై పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారు రూ.5 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దుర్మార్గం పీలేరు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను చంపడం ఆటవిక చర్య అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీపై రాష్ట్ర మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన పీలేరులో పర్యటించారు. మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఓట్లకోసం అమలుకు వీలుకాని హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు విస్మరించి జీవోలతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపిం చారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1.11 లక్షల కోట్లు ప్రవేశపెట్టి అందులో రుణమాఫీకి కేవలం రూ.ఐదు వేల కోట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే దమ్ములేక ఆర్బీఐపై సాకులు చెప్పడం టీడీపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఎటువంటి షరతులూ లేకుండా రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను టీడీపీ నాయకులు టార్గెట్ చేసి హత్యలకు పురమాయిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా రా ష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని తెలిపారు. దీనిపై శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ములేక ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సమయం వ చ్చినపుడు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ మండలాధ్యక్షుడు నారే వెంకట్రమణారెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు కడప గిరిధర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యు డు ఎస్.హబీబ్‌బాషా, స్టాంప్‌ల మస్తాన్, పార్టీ నాయకులు కే.ఆనంద్, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట్రమణ, అల్లాబక్షు, గౌస్‌బాషా, రంగన్న, జయపాల్‌రెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, బాబ్జిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, నవాజ్, మునికృష్ణ, రాజేష్, హరిరాయల్, ఆనంద్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.