విపక్ష నేతను అడ్డుకోవడం దారుణం
అధికారపక్షంపై జగన్ విమర్శ
ప్రతిపక్షమన్నది ప్రజల గొంతుక.. వినిపించేటప్పుడు అధికారపక్షం వినాలి
బడ్జెట్‌పై నా ప్రసంగం ముగియకముందే అది పూర్తయినట్లు చెప్పడం సరికాదు..
ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా అధికారపక్షం ప్రయత్నిస్తోంది
వారే మాపై వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు దిగారు
వాళ్లు ఎంత రెచ్చగొట్టినా నేను పూర్తిగా బడ్జెట్‌పై గణాంకాలతో మాట్లాడా
మంత్రి యనమల ఈ అంశాన్ని లేవనెత్తడం, దానిని స్పీకర్ అనుమతించడం చూస్తే మంత్రి తానా అంటే స్పీకర్ తందానా అన్నట్లుంది
చంద్రబాబు మాట్లాడేటప్పుడు మేం ఇలా అడ్డుతగిలితే వాళ్లు ఊరుకుంటారా?
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పై గణాంకాలు, ఆధారాలతో మాట్లాడుతుంటే అధికారపక్షానికి చెందిన మంత్రులు, సభ్యులు అడ్డుకోవడం దారుణమని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అన్నది ప్రజల గొంతుక అని, ప్రజల గొంతు వినిపించేటప్పుడు అధికారపక్షం వినాలని, ఆ సద్గుణం కూడా లేకపోతే ఇక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్లా... లేనట్లా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా ఒక వ్యూహం ప్రకారం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా బడ్జెట్‌పై తాను చర్చ మొదలుపెట్టి, అది ముగియక ముందే పూర్తయినట్లుగా చెప్పడం సరికాదని అన్నారు. తనకు తెలిసినంతవరకూ ఈ దేశంలో, రాష్ట్రంలోనూ ఎక్కడా ఇలా జరిగి ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం శాసన సభ వాయిదా పడిన తరువాత ఆయన తన చాంబర్‌లో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ‘‘బడ్జెట్‌పై చర్చకు నాకు కేటాయించిన సమయం 1.30 గంటలు. అయితే నా ప్రసంగం ముందుకు సాగకుండా అధికారపక్షానికి చెందిన మంత్రులు, చీఫ్ విప్, ఇతర సభ్యులు అనేకసార్లు అడ్డుతగిలారు. 52నిమిషాల పాటు అడ్డు కున్నారు. పోనీ నేనేమైనా అభ్యంతరకరంగా మాట్లాడానా.., వ్యక్తిగత విమర్శలు చేశానా అంటే అదీ లేదు. వాళ్లు (అధికారపక్షం) మాత్రం తడవతడవకూ వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకూ దిగారు. వాళ్లు ఎంత రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శించినా నేను బడ్జెట్ విషయాల నుంచి పక్కకు మళ్లలేదు.
నేను పూర్తిగా విషయానికే పరిమితమవుతూ నా దగ్గర ఉన్న గణాంకాలు, ఆధారాలతోనే మాట్లాడుతూ వచ్చాను. పూర్తిగా సబ్జెక్ట్ పైనే మాట్లాడాను. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులెంత? అధికారపక్షం గతంలో చేసిన హామీలేమిటి అన్నవాటిపై కూడా ఆధారసహితంగా మాట్లాడాను. వాళ్లు అంతరాయం కలిగించి మాట్లాడిన 14 సార్లూ వ్యక్తిగత విమర్శలకే దిగారు. రెచ్చగొట్టడానికి ఏమేమో చేశారు. వాళ్లు మమ్మల్ని పందికొక్కులు అన్నా మేం మౌనం వహించాం’’ అని చెప్పారు. స్పీకర్ వారు మాట్లాడిన మాటలన్నింటినీ అనుమతించారని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు మాట్లాడేటప్పుడు మేం ఇలా అడ్డుతగిలితే వాళ్లు ఊరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ‘‘మా పార్టీలో ఎవరు ఎంతసేపు మాట్లాడాలి, మా పార్టీకి కేటాయించిన మొత్తం సమయంలో ఒకరే మాట్లాడతారా లేక ఎక్కువ మంది మాట్లాడతారా అనేది పూర్తిగా మా పార్టీ అభీష్టం ప్రకారమే జరుగుతుంది. అలా కాకుండా అధికారపక్షం నిర్దేశించడం ఏమిటి? మా పార్టీలో ఏం జరగాలో ఇంకొక పార్టీ చెబితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి ఈ అంశాన్ని లేవనెత్తడం, దానిని స్పీకర్ అనుమతించడం చూస్తే మంత్రి తానా అంటే స్పీకర్ తందానా అన్నట్లుంది’’ అని వ్యాఖ్యానించారు.
స్పీకర్‌ను ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారనే విమర్శ ఉందని విలేకరులు అనగా.. ‘‘మేం ప్రభావితం చేయడంలేదు. ఆయనే ప్రభావితమయ్యారు. టీవీలు చూసే వారెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. నేనేమైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానేమో రికార్డులు చూసి చెప్పమనండి. చాలా ఓపిగ్గా చిరునవ్వుతోనే సహించాం’’ అని ఆయన బదులిచ్చారు.