ఇక వేగం పెంచండి
♦ నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
♦ ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, డిండి పనులు ఏకకాలంలో జరగాలి
♦ మూడు, నాలుగే ళ్లలో కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళిక అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయించినందున ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాణహిత, కాళేశ్వరం, శ్రీసీతారామ, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో జరగాలని సూచించారు. నిర్మాణంలోని ప్రాజెక్టులను సైతం త్వరితగతిన పూర్తి చేసి మూడు, నాలుగేళ్లలో కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళిక అమలు చేయాలన్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, సీఎస్ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారులు ఆర్.విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా చర్చించారు. గోదావరి నుంచి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల, మంచిప్ప ప్రాంతాల్లో నిర్మించనున్న రిజర్వాయర్లకు నీరు చేరే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ టన్నెళ్లు నిర్మించాలి, ఎక్కడ పంపింగ్ చేయాలి, ఎక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలి అనే అంశాలపై అధికారులు తయారు చేసిన నివేదికలను సీఎం పరిశీలించారు. గోదావరిలో నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న రోజే నీటిని పంప్ చేసి రిజర్వాయర్లు నింపుకోవాలని సూచించారు. దేవాదుల పంప్‌హౌస్ దిగువ భాగంలో బ్యారేజీ నిర్మించడం ద్వారా ఏడాది పొడవునా ప్రాజెక్టుకు నీరందుతుందని, దీని ద్వారా వరంగల్ జిల్లాలో చాలా వరకు భూమికి సాగునీరు అందించవచ్చని కేసీఆర్ తెలిపారు. తక్కువ ముంపు, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును ఉపయోగించుకునేలా బ్యారేజీ ఉండాలన్నారు. సాగునీటితోపాటు హైదరాబాద్ మంచినీటి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని... ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, నిజాం సాగర్, ఎస్సారెస్పీ, సింగూరు ప్రాజెక్టుల కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
‘వాటర్ వీక్’కు ఆహ్వానం
ఢిల్లీలో ఏప్రిల్ 4న జరగనున్న వరల్డ్ వాటర్ వీక్ సదస్సుకు విచ్చేయాలంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతి సోమవారం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. ‘మిషన్ కాకతీయ’పై ప్రజెంటేష్‌న్ ఇవ్వాలని కోరారు. ఈ పథకానికి వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయిం చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతి నిధులు హాజరుకానున్నారు.