‘మిడ్‌మానేరు’ భారం రూ.193.32 కోట్లు
- కొత్త అంచనా భారాన్ని తేల్చిన నీటి పారుదల శాఖ
- ప్రాజెక్టుకు అయ్యే కచ్చిత వ్యయం రూ.388 కోట్లని ప్రభుత్వానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణ పనులను కొత్త అంచనా వ్యయాలతో చేపడితే ప్రాజెక్టుపై అదనంగా భారీగా భారం పడనుంది. గత పని విలువతో పోలిస్తే మొత్తంగా రూ.193.32 కోట్ల మేర వ్యయం పెరుగుతుందని నీటి పారుదల శాఖ తేల్చింది. శుక్రవారం ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తంగా మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.388.50 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ వరద కాల్వలో భాగంగా కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై 25.873 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన మిడ్‌మానేరుకు ఇటీవల వర్షాలతో గండి పడిన నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అధికారులు కొత్త అంచనాలతో తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న వ్యయం రూ.339.99 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.176 కోట్ల మేర పని పూర్తయింది. మిగిలిన పని విలువ రూ.164 కోట్ల వరకు ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ 20 శాతం లెస్‌కు పని దక్కించుకోవడంతో ప్రస్తుతం మిగిలిన పనికి దాన్ని కలుపుకుంటే అది రూ.195.18 కోట్ల వరకు పెరుగుతోంది. ఆ ప్రకారం ప్రస్తుత స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (ఎస్‌ఎస్‌ఆర్)ను అంచనా వేస్తే మిగిలిన పనుల విలువ రూ.388 కోట్లుగా ఉంది. ఎక్కువగా కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వల్లే రూ.54.85 కోట్లు మేర పెరుగుతుండగా, ప్రస్తుత సిమెంట్, స్టీలు ధరలకు అనుగుణంగా ఇవ్వనున్న ఎస్కలేషన్‌తో మరో రూ.32.17 కోట్లు పెరుగుతోంది. ఇక ప్రస్తుతం గండి పడిన ప్రాంతంలో తిరిగి పునరుద్ధరణ చేసేందుకు మరో రూ.27.26 కోట్లు, మట్టి అవసరాలకు రూ.64.33 కోట్లు, కొత్త పన్నులతో రూ.7.36 కోట్లు మేర భారం ఉంటుందని నివేదికలో అధికారులు వివరించారు.