జగన్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు
బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన విపక్షనేత
సాధికారిక లెక్కలతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన జగన్
తట్టుకోలేక జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ సభ్యులు
వారు అడిగిన ప్రతిసారీ మైక్ ఇచ్చిన స్పీకర్
పదేపదే పాత ఆరోపణలే చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు
గడువులోగా ముగించాలంటూ జగన్‌కు స్పీకర్ సూచనలు
అంతరాయాలను పట్టించుకోని వైనం
విపక్షనేత మాట్లాడుతుండగానే మైక్ కట్
వైఎస్సార్‌సీపీ నిరసన... అర్ధంతరంగా సభ వాయిదా
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం అధికార పక్షం నుంచి పలు అవాంతరాల మధ్య సాగింది. సోమవారం బడ్జెట్‌పై సాధారణ చర్చను జగన్ ప్రారంభించగా... అధికార పక్షం అవాంతరాల మధ్య అది పూర్తికాకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆధారాలతో సహా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న జగన్‌కు అధికార టీడీపీ సభ్యులు రెండు గంటల వ్యవధిలో అనేకసార్లు అడ్డు తగిలారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రతిసారీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వారికి మైక్ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని, హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించని వైనాన్ని విపక్ష నేత గట్టిగా వినిపిం చినప్పుల్లా.. టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించి ఇతర విషయాలను ప్రస్తావిస్తూ ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. గతంలో చేసిన దూషణల్నే మళ్లీ వినియోగించుకున్నారు. పలుమార్లు టీడీపీ సభ్యులు అంతరాయం కలిగిం చగా... విపక్షానికి ఇచ్చిన గడువులోగా ముగిం చాలని విపక్ష నేతకు స్పీకర్ పలుమార్లు సూచిం చారు.
టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, విపక్ష నేతగా అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వీలుగా తగిన సమయం ఇవ్వాలని, పరిమితి విధించవద్దని జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. పార్టీకి కేటాయించిన సమయా న్ని ఎలా వినియోగించుకోవాలనే అంశం పూర్తి గా పార్టీకి సంబంధించిన వ్యవహారమని జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మట్లాడొద్దని తాము సూచిస్తే అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. పార్టీలో మిగతా సభ్యులకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్‌కు స్పీకర్ సూచించారు. గడువు ముగిసిందని, వెంటనే ముగించాలంటూ స్పీకర్ పలుమార్లు కోరారు. పలు సందర్భాల్లో విపక్ష నేత మైక్ కట్ చేశారు. అలా చేసిన ప్రతిసారీ వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసిన తర్వాతే స్పీకర్ అవకాశం ఇచ్చారు.
మంత్రి మాటలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
జగన్ మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... జలయజ్ఞంలో పందికొక్కుల్లా సర్కారు సొమ్ము తినేశారంటూ అనేక ఆరోపణలు చేశారు. దాంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం చుట్టుముట్టారు. దాంతో మంత్రి మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు. హామీలను అమలు చేయకుండా గత పదేళ్లలో రాష్ట్రం నాశనమైందంటూ గత ప్రభుత్వాల మీదకు నెపం నెట్టేసే చెప్పే ప్రయత్నాన్ని జగన్ తన ప్రసంగంలో ఎత్తిచూపుతూ... గత 30 సంవత్సరాల జీఎస్‌డీపీ లెక్కలను సభ ముందు ఉంచారు. చంద్రబాబు ముందు పదేళ్లు, తర్వాత పదేళ్ల జీఎస్‌డీపీ గణాంకాల ఆధారంగా ఆయా ప్రభుత్వాలకు మార్కులు ఇవ్వడం పట్ల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా, అధికారిక డాక్యుమెంట్ల నుంచే ఈ గణాంకాలు చెబుతున్నానని, అవసరమైతే పరిశీలించుకోవచ్చని జగన్ సమాధానం ఇచ్చారు. చర్చను ప్రారంభమైన తర్వాత నుంచి చివరకు సభ వాయిదా పడే సమయంవరకు అధికార పక్ష సభ్యులు పలుమార్లు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అవకాశం తీసుకొని.. శృతిమించిన ఆరోపణలు గుప్పించారు. రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని, ఎన్నికల హామీ నుంచి వెనక్కిపోమని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మేజర్లు అయితే ఇద్దరికీ రుణమాఫీ వర్తిస్తుందని, మైనర్లయితే ఒకరికే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు తెలిపారు.
అర్ధాంతరంగా సభ వాయిదా
ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతుండగానే.. ఇచ్చిన గడువు ముగిసిందంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. బడ్జెట్‌పై చర్చలో టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తాను మాట్లాడుతున్నది పూర్తికాకముందే అధికార పార్టీ సభ్యుడికి అవకాశం ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
సభ్యులు పోడియం వద్ద నుంచి వెనక్కి వెళ్లాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు వినలేదు. మరోవైపు సూర్యారావు మాట్లాడుతూనే ఉన్నారు. సభలో గంధరగోళ పరిస్థితి నెలకొనడంతో మధ్యాహ్నం 1.45 గంటలకు సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.