‘మాఫీ’ తొలిదశ అప్‌లోడ్ గడువు పెంపు
- రుణ విముక్తిపై రేపు బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: తొలిదశలో రుణమాఫీకి సంబంధించి రైతుల వివరాల అప్‌లోడ్‌కు గడువును ఈనెల 23 వరకు పొడిగించారు. ఈ గడువు శనివారం ముగిసినా, ఇంకా ఆరులక్షల ఖాతాల వివరాలు అప్‌లోడ్ కావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో 26.77 లక్షల మంది రైతులకు సంబంధించి 20 శాతం మేర రుణ విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ నాలుగో తేదీ ప్రకటించారు. వీరిలో ఆరులక్షల మంది రైతుల ఖాతాల వివరాలను ఇంకా బ్యాంకర్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది.
ఈ వివరాలను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌లో వేసిన తరువాత వడపోత చేపడతారు. ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, భూమి రికార్డులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఈ ఖాతాల కుటుంబాల సంఖ్యను తీస్తారు. అప్పుడు రుణ విముక్తికి అర్హులైన కుటుంబాలెన్ని, రుణం ఎంత అనేది తేలుతుంది. తొలి దశలో రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,664 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించగా ఇప్పటి వరకు రూ.4,300 కోట్లు వ్యయమయ్యాయి. మరోవైపు రెండో దశలో రుణ విముక్తి కోసం 25 లక్షల ఖాతాల వివరాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
శనివారంతో ఈ గడువు ముగిసింది. 25 లక్షల ఖాతాలకుగాను శనివారం నాటికి 14 లక్షల ఖాతాల వివరాలు మాత్రమే వచ్చాయి. ఇక గడువు పొడిగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 14 లక్షల ఖాతాలనువడపోసి మాఫీకి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. సీఎం చంద్రబాబు సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించనున్నారు.