
రెండు మండలాల్లోనే నష్టమట
కర్షకునికి ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రుణమాఫీ పితలాటకం తీరకముందే మరో పిడుగు వారి నెత్తిన పడింది. జిల్లాలో 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన అనంతరం సర్వే బృందం సేకరించిన లెక్కల్లో పంట నష్టాలు అంతగా లేవని, సగానికి పైగా దిగుబడి రైతులకు దక్కిందని లెక్క తేల్చడంతో ఇన్‌పుట్ సబ్సిడీ రెండు మండలాలకే పరిమితమయింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా పడిపోయింది. దీంతో పంటలు పండక, వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా జిల్లాలో 56 మండలాలుంటే అందులో 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. యద్దనపూడి, ఉలవపాడు మండలాల్లో మాత్రమే వర్షపాతం ఎక్కువగా పడిందని గుర్తించారు.
ఇంతవరకు బాగానే ఉంది. కరువు మండలాలుగా గుర్తించిన తర్వాత జిల్లా యంత్రాంగం పంట నష్టాలను గుర్తించేందుకు కరువు సర్వే బృందాలను నియమించింది. ఈ బృందాలు ఆయా మండలాల్లో సర్వే జరిపి నివేదికలిచ్చాయి. మార్కాపురం, కొరిశపాడు మండలాల్లోనే 50 శాతం పైగా పంట నష్టం జరిగిందని తేల్చారు. మిగిలిన మండలాల్లో కరువు చెప్పుకోదగిన స్థాయిలో లేదని తేల్చడంతో ఆయా మండల రైతుల్లో గందరగోళం నెలకొంది.
కొరిశపాడు మండలంలో మొక్కజొన్న పంట 50 శాతానికిపైగా దెబ్బతిందని బృందం గుర్తించినట్లు సమాచారం.108 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 168 రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కాపురం మండలంలో పత్తిపంట 50 శాతంపైగా దెబ్బతింది. 1168 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.1335 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని సర్వే బృందం తేల్చిందని సమాచారం. ప్రకటించిన కరువు మండలాల్లో పంటలు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరగలేదని తేల్చారు. మొత్తం 50 శాతంలోపే పంటలు నష్టపోయినట్లు గుర్తించారు.
ఒక ఎకరా పొలం ఉంటే అందులో 50 శాతానికిపైగా పంట ఎండిపోవాలి. సరాసరి దిగుబడి కూడా 50 శాతం కన్నా తక్కువ రావాలి, ఇటువంటి నిబంధనలన్నీ క్రోడీకరించారు. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నప్పటికీ దిగుబడి 50 శాతం కన్నా తగ్గే పరిస్థితి లేదని బృంద సభ్యుల భావన. సర్వే బృందాల నివేదికలపై విజిలెన్స్ బృందాలు కూడా తనిఖీ చేసే అవకాశం ఉండటంతో వారు సాధ్యమైనంతవరకూ పంట నష్టం తక్కువగానే చూపించినట్లు తెలిసింది. 50 శాతం పంట నష్టపోయినచోట మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీకి అవకాశం ఉంది.
మిగిలినచోట్ల కరువు మండలాల ప్రకటన కారణంగా రుణాల రీ షెడ్యూల్, పన్ను రాయితీ వంటి వెసులుబాటు మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో సార్వాలో -44 శాతం, దాళ్వాలో -46 శాతం వర్షపాతం తక్కువ నమోదయింది. ఒక్క జూలై నెలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, జూన్, డిసెంబర్ నెలల్లో అతి తక్కువ వర్షపాతం, మిగిలిన నెలల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఎలెన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి.
అక్టోబర్ వరకు వర్షం జాడలేకుండా పోయింది. 2,42, 062 హెక్టార్ల సాధారణ లక్ష్యానికిగాను సుమారుగా లక్ష హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. వేసిన పంటలు సైతం వర్షాలు లేక ఎండిపోయాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు బాబు రుణమాఫీ పుణ్యమా అంటూ బ్యాంకు రుణాలు అందక రైతులు బయట అధిక వడ్డీలకు తెచ్చి మరింత అప్పుల పాలయ్యారు.
అప్పు వడ్డీతో సహా రెండింతలై కూర్చుంది. ఈ పరిస్థితుల్లో జిల్లా అధికారులు మొత్తం కరువు పరిస్థితి ఉందని నివేదిక పంపించారు. మొత్తం 56 మండలాలుండగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రెండు మండలాలకే పరిమితం చేస్తూ ఇచ్చిన ఈ నివేదిక రైతులను కంగారు పెడుతోంది.