నారీ..భేరీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పొదుపు సంఘాల మహిళలు కదంతొక్కారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. మహిళల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి నమ్మించి ఓట్లేయించుకున్నారు.. ఇంట్లో భర్త చెబుతున్నా వినకుండా చంద్రబాబుకు ఓట్లేశాం.. సీఎం అయ్యాక మాట తప్పుతున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోతే టీడీపీ ప్రభుత్వానికి పాడె కడతాం’ అని మహిళలు శాపనార్థాలు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తై డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. అంతకుముందు ర్యాలీలు చేపట్టారు. తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పొదుపు నిధులు, పిల్లల స్కాలర్‌షిప్పులను అప్పుల కింద జమ చేసుకోవటంపై మండిపడ్డారు. స్త్రీ నిధిపై వడ్డీ వసూలు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెట్, పరపతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బేతంచర్లలో భారీ ర్యాలీ నిర్వహించి నినదించారు. అనంతరం ధర్నా చేపట్టారు. బండిఆత్మకూరులో ర్యాలీతో హోరెత్తించారు. ఆలూరులో అంబేద్కర్ కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి మండల కేంద్రాల్లోనూ మహిళలు కదం తొక్కారు. ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆదోని తహశీల్దార్ కార్యాయం వద్ద ధర్నా చేసి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరువెళ్ల మండల కేంద్రాల్లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగాయి. బనగానపల్లి, కోవెలకుంట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల నినాదాలు మిన్నంటాయి. ఎమ్మిగనూరులో శివ కూడలి వద్ద ధర్నా నిర్వహించి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. గోనెంగండ్ల, మంత్రాలయంలో డ్వాక్రా మహిళలు రుణ మాఫీ కోసం ఆందోళన చేపట్టారు. కల్లూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండల కేంద్రాల్లోనూ మహిళలు ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. ఇచ్చిన హామీని అమలు చేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. కొత్త రుణాలను ఇవ్వటం ఆపేసి పొదుపు డబ్బును అప్పు కింద జమ చేసుకోవడం దారుణమన్నారు. పిల్లల స్కాలర్‌షిప్పులను సైతం జమ చేసుకోవటాన్ని వారు నిరసించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చడాన్ని తప్పుబట్టారు. రుణమాఫీ అయ్యేవరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు.