‘గాలి’ నాటకం! | Putturulo Women's Federation meetings | Sakshi
Sakshi News home page

‘గాలి’ నాటకం!

Published Sat, Jul 19 2014 4:23 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

‘గాలి’ నాటకం! - Sakshi

‘గాలి’ నాటకం!

  •      సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు గాలి ముద్దుకృష్ణమ ఎత్తుగడ
  •      డ్వాక్రా మహిళలను ప్రసన్నం చేసుకునే యత్నం
  •      మభ్య పెడుతున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు
  •      పుత్తూరులో మహిళా సమాఖ్య సమావేశాలు
  • పుత్తూరు :  డ్వాక్రా రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న పొంతనలేని ప్రకటనలపై వ్యతిరేకత వస్తుందనే ముందస్తు ఆలోచనతో అధికార తెలుగుదేశం పార్టీ పక్షాలు కొత్త నాటకానికి తెరలేపాయి. అధికార పక్షం ఉన్న మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్నఫలంగా డ్వాక్రాగ్రూపు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    అందరినీ ఒకే వేదికపైకి రప్పిస్తే విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించి సమాఖ్యల వారీగా ఆయా ప్రాంతాల్లోనే సమావేశపరుస్తున్నారు. పెపైచ్చు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు అతి తెలివిని ప్రదర్శిస్తూ మాయ మాటలతో రుణ మాఫీ విషయాన్ని మభ్య పెట్టే పనిని కార్యక్రమంగా చేపట్టారు. సమావేశాలకు హాజరుకాకపోతే మున్ముందు సమాఖ్య ప్రతినిధులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని గ్రహించి వెళ్లాల్సి వస్తోందని పలువురు మహిళల వాదన.

    నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచనలతో పుత్తూరు మున్సిపల్ పరిధిలో డ్వాక్రా గ్రూపుల సమావేశాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధిపై  పార్టీ అధిష్టానం అసంతృప్తిలో ఉందనే వాదన వినిపిస్తోంది. దీనిని అధిగమించి సీఎం దృష్టిని ఆకర్షించే యత్నంలో ఆయన వేసిన ఎత్తుగడలో భాగమే డ్వాక్రా గ్రూపు మహిళల సమావేశాల నిర్వహణ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    పుత్తూరు మున్సిపల్ పరిధిలో 862 డ్వాక్రా గ్రూపుల్లో 8620 మంది సభ్యులు ఉన్నారు. 24 వార్డులకు 42 సమాఖ్యలు కాగా  ఒక్కొక్క సమాఖ్య నేతృత్వంలో 15 నుంచి 20 గ్రూపులు ఉన్నాయి.  వీరికి 2013-14 ఆర్థిక సంవత్సానికి బ్యాంకు లింకేజి కింద రూ.11 కోట్ల రుణాలు అందించారు. ఒక్కొక్క గ్రూపునకు 1 నుంచి 5 లక్షల మేరకు రుణ మంజూరు చేశారు. అయితే ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని హామీతో బ్యాంకులకు నెలసరి కంతులు కట్టడం మానేశారు.

    ప్రస్తుతం రుణమాఫీపై సమగ్ర సమాచారం లేకపోవడంతో మహిళల్లో వ్యతిరేకత రాకుండా చేసేందుకు నేరుగా మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, టీడీపీ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే శుక్రవారం పుత్తూరు మున్సిపల్ పరిధిలోని 13, 14, 24 వార్డుల్లో మహిళా సమాఖ్య సమావేశాలు నిర్వహించారు. కాగా 14 వార్డులో నిర్వహించిన సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధి తనయుడు హాజరయ్యారు.  

    రుణమాఫీ త్వరలో చేస్తారని ముందుగా రైతురుణ మాఫీకి ప్రాధాన్యత ఇస్తున్నారని తరువాత  డ్వాక్రా మహిళలకు అంటున్న దశలో ఓ మహిళ ప్రశ్నిస్తూ ‘ఎప్పుడనేది తేదీ చెప్పకుండా తరువాతంటూ ఎప్పటికయ్యా..? ఇప్పటికే చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది’ అని నిలదీయడంతో ఆమెకు సర్దిచెప్పారు. నిబంధనల మేరకు సమాఖ్య సమావేశాలకు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరు కావాలి. అయితే మాజీ ప్రజా ప్రతినిధి తనయుడిని ఏ హోదాలో  ఆహ్వానించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement