
మాఫీ కొందరికే!
అనుకున్నట్లే చంద్రబాబు సర్కారు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీపై ఊరించే ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి.. ఆచరణలో ఉసూరుమనిపించారు. 20 శాతం మాత్రమే తొలివిడతలో రుణమాఫీ చేస్తామని, తక్కిన రుణాలను నాలుగు విడతల్లో నాలుగేళ్లలో మాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న ‘అనంత’ రైతాంగం చంద్రబాబు ప్రకటనతో నీరసించిపోరుుంది. జిల్లాలలో 50 వేల రూపాయల కంటే అధికంగా తీసుకున్న రైతులే అధికమని వీరి రుణాలు మాఫీ అయ్యేందుకు నాలుగేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పడం దారుణమని మండిపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రైతులకు సంబంధించి అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే చెప్పి.. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు.
జిల్లాలో పాదయూత్ర చేపట్టినప్పుడు రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ ‘అనంత’ రైతుల సాక్షిగా ఆయన వాగ్దానం చేశారు. టీడీపీ మానిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. తాజాగా పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని ప్లేటు ఫిరాయించడంపై రైతులు మండిపడుతున్నారు.
రూ. 1.50 లక్షల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని చెబుతున్నారు. దీనిపై ప్రకటన చేసేందుకు ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. ఈ కాలంలో ‘అనంత’లో 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈక్రమంలో ఇచ్చిన మాట నెరవేర్చకుండా రైతులను మోసం చేయడం, రైతుల ఆత్మహత్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచింది. గత నెల 5న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేసింది. నేడు కలెక్టరేట్ల ముందు మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో రైతు రుణమాఫీపై చంద్రబాబు గురువారం విధాన ప్రకటన చేశారు. 2013 డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి కుటుంబానికి రూ. లక్షన్నర వరకు మాఫీ చేస్తామని చెప్పారు. రూ.50 వేల వరకు రుణమున్న రైతులకు పూర్తిగా, రూ.50 వేలకు పైగా ఉన్న వాటిని 20 శాతం మాఫీ చేస్తానని ప్రకటించారు.
1.57లక్షల రైతులకు మాత్రమే వర్తింపు
జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఆధార్‌కార్డులు, కుటుంబంలో ఒక్కరికి, ఒక్క బ్యాంకులోని రుణం మాత్రమే అంటూ సర్కారు విధించిన నిబంధనల నేపథ్యంలో అర్హుల సంఖ్య దాదాపు 50 శాతానికిపైగా తగ్గింది. చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం జిల్లాలో 2.50-3లక్షల ఖాతాలకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. ఇందులో తొలి విడతలో 20 శాతం మాఫీ చేస్తామంటున్నారు.
ఇందులో 1.57 లక్షల మంది కంటే తక్కువగానే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 8.67 లక్షల మంది రైతులు నష్టపోనున్నారు. పైగా 50వేల రూపాయల కంటే అధికంగా రుణాలు ఉన్న రైతుల రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామంటే, నాలుగేళ్ల పడుతుంది. బ్యాంకులకు పూర్తిగా బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలను ఇస్తారు. అంటే నాలుగేళ్ల దాకా రైతులకు కొత్త రుణాలను అందని పరిస్థితి. ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చేందుకు బాండ్లు పంపిణీ చేస్తామని చెబుతోంది.
మరి బాండ్ల విధానంపై బ్యాంకర్లు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.
గతేడాది బీమా సొమ్ము పాత బకాయికి జమ 2013-14కు సంబంధించి 226కోట్ల రూపాయల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైంది. నెలన్నర కిందటే డబ్బులు బ్యాంకులకు చేరినా, బ్యాంకర్లు మాత్రం రైతుల ఖాతాల్లో బీమా మొత్తాన్ని జమ చేయలేదు. రైతుల బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇలా జమ చేసుకోకూడదు. ఈక్రమంలో కూడా జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు బ్యాంకర్లను నిలువరించలేకోయారు. దీంతోపాటు గతేడాదికి సంబంధించి 643 కోట్ల పంట నష్టపరిహారం జిల్లాకు అందాల్సి ఉంది.
ఇప్పటి వరకూ ఈ సొమ్ముపై ప్రభుత్వం ఉలుకు, పలుకూ లేకుండా ఉంది. ఇస్తారో.. ఇవ్వరో కూడా తెలీని అయోమయ పరిస్థితిలో ‘అనంత’ రైతాంగం ఉంది. ఈ ఏడాది 3,350 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రుణ మాఫీ వల్ల బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. దీంతో కేవలం 370 కోట్ల రుణాలను మాత్రమే రైతులు తీసుకున్నారు. రుణాలు తీసుకోకపోవడంతో అనివార్యంగా వాతావరణ బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో ఈ ఏడాది పంట పూర్తిగా నష్టపోయినా బీమా వచ్చే పరిస్థితి లేదు.
కౌలు రైతులకు మొండి చెయ్యి
జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 11,843 మంది కౌలు రైతులు ఉన్నారు. వీరు బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు పాసుపుస్తకాలు ఉండకపోవడంతో, బంగారు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా బంగారు రుణాలు 2.12 లక్షల ఖాతాల ద్వారా 1,851.18 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బంగారు రుణాలను తొలి ప్రాధాన్యత కింద గుర్తించకుండా మూడో ప్రాధాన్యతగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కౌలు రైతులకు చిల్లిగవ్వ కూడా మాఫీ అయ్యే పరిస్థితి లేదు.
రూ.955 కోట్లు వడ్డీ
రుణాలు అన్నీ గడువు మీరిన జాబితాలోకి చేరడంతో వడ్డీ, అపరాధ వడ్డీ, చక్రవడ్డీ భారం పడుతోంది. బ్యాంకర్లు చెబుతున్న ప్రకారం వీటిపై 14 శాతం వడ్డీ చెల్లించాల్సివుంటుంది. దాని ప్రకారం మొత్తం రుణాలపై రూ.955 కోట్లు వడ్డీ భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎంత మందికి ఏ మేరకు ప్రయోజనం కల్పిస్తుందనేది అంతుచిక్కడం లేదు. బ్యాంకర్లు, రైతుల్లో గందరగోళం నెలకొంది.
9.86 లక్షల అకౌంట్లు సేకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ కోసం బ్యాంకర్లు రైతుల నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. ఆధార్, రేషన్‌కార్డు నెంబర్‌తో పాటు అన్ని రకాల వివరాలతో 9.86 లక్షల మందిని వివరాలు సేకరించి అప్‌లోడ్ చేశారు. అందులో 2.36 అకౌంట్లు మిస్‌మ్యాచింగ్ కాగా వాటిని మరోసారి రీవెరిఫికేషన్ చేసి 1.08 లక్షల అకౌంట్లను సరిచేసి పంపారు. తక్కిన 1.18 అకౌంట్ల పరిస్థితి ఏమిటనేది అర్థంకాకుండా పోయింది. బ్యాంకర్లు సేకరించిన 9.86 లక్షల అకౌంట్లలో చిన్నకారు రైతులవి 5.80 లక్షలు, సన్నకారు రైతులవి 1.92 లక్షలుగా తక్కిన 2.14 లక్షల అకౌంట్లు పెద్దరైతులవిగా పరిగణించారు.
అధికారిక లెక్కలు రాలేదు
రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి 9.86 అకౌంట్ల వివరాలు అప్‌లోడ్ చేసి పంపాం. అయితే ఎంత మందికి ఎన్ని కోట్లు రుణమాఫీ అవుతుందనే వివరాలు అధికారికంగా రాలేదు.
- జయశంకర్, ఎల్‌డీఎం
ఆందోళనకు సిద్ధమైన ప్రతిసారీ మోసపూరిత ప్రకటన
రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వంపై సమరభేరి మోగించే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టే ధర్నా కార్యక్రమాలకు ముందు మభ్యపెట్టే ప్రకటనలు గుప్పించడం చంద్రబాబుకు అలవాటైపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఇప్పటికీ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. మహాధర్నాకు రైతులు పోటెత్తే పరిస్థితి ఉందని గ్రహించిన చంద్రబాబు ఉన్నఫలంగా రుణమాఫీ అంటూ కంటితుడుపు చర్యలకు దిగారు. అన్ని రకాల రుణాలు మాఫీ చేసేదాకా రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట కొనసాగిస్తుంది.
- ఎం.శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
మాట నిలబెట్టుకున్నాం
రుణమాఫీ చేస్తామంటూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా తొలి అడుగు వేస్తూ అధికారిక ప్రకటన చేశారు. పంటరుణాలు, బంగారు రుణాలకు సంబంధించి కుటుంబానికి రూ.లక్షన్నర గడువులోగా మాఫీ చేసి తీరుతాం. త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ ప్రకటన చేస్తారు. ఐదేళ్ల హాయూంలో అన్ని రకాల హామీలు చంద్రబాబు తప్పకుండా నెరవేరుస్తారు.
- బీకే పార్థసారధి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
రైతులకు అన్యాయం
మాట మార్చడం చంద్రబాబు అలవాటు. రుణమాఫీ విషయంలో మరోసారి ఆయన తత్వం నిరూపించుకుని రైతులకు అన్యాయం చేశారు. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు చేసింది ఏమిటి? రూ.50 వేల వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేసి, ఆపై ఉన్న వాటిని విడత వారీగా మాఫీ చేస్తాడంట! ఆయన టూర్లకు, క్యాంప్ కార్యాలయాల ముస్తాబులకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి డబ్బులుంటాయి కానీ, రైతులకు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవంటారు. - కోటా సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు
రుణ మాఫీ చేస్తాడనే నమ్మకం లేదు
రుణ మాఫీ చేస్తాననడంతోనే జనాలు ఓట్లు వేశారు. తొలి సంతకం చేసినపుడే ప్రజల్లో చంద్రబాబు నాయుడు విశ్వాసం కోల్పోయారు. రుణ మాఫీ చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేదు. చేసేంత వరకు నమ్మే స్థితిలో లేరు.
- జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి
ఒకేసారి రుణ మాఫీ చేయాలి
రూ.50వేల లోపు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించారు. అలాగే మిగతా వారికి 20 శాతం చొప్పున అంటున్నారు. అన్ని రుణాలు ఒకేసారి మాఫీ చేయాలి. రుణమాఫీ, కొత్త రుణాలు, ఇన్‌పుట్, వాతావరణ బీమా లేక ఇప్పటికే రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం బాండ్లు అందజేస్తామని గ్యారంటీ ఇచ్చి తక్షణం కొత్త రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.
- ఓబులు, సీపీఎం జిల్లా కార్యదర్శి
రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చుకుంటున్నారుు. అందులో భాగంగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సాధ్యమైనంత త్వరగా అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ఇబ్బందుల దష్ట్యారుణ మాఫీ కార్యక్రమం దశల వారీగా జరుగనుంది.
- వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి