- మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి
తాడికొండ: తుళ్ళూరు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోని రైతులకు ఒకేసారి రూ.లక్షన్నర రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్‌శాఖమంత్రి నారాయణ తెలిపారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడలో సోమవారం ఉదయం సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించామని, దానిపై తగిన చర్యలకు సీఎం వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో రాజధాని రైతులందరికీ రుణ మాఫీ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రూ.186 కోట్లు ఖర్చవుతుందన్నారు.
భూసమీకరణ వేగవంతానికి చర్యలు..
తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తుళ్ళూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా 10 వేల ఎకరాలు, ఫిబ్రవరి 10 తేదీలోగా 18 వేల ఎకరాలు సమీకరించి, ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు.