చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రుణమాఫీ కోసం వందశాతం తప్పులులేని సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి ఆయన మండల స్థాయి అధికారులతో రుణమాఫీ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారులు ఈ పథకానికి త్రిమూర్తులాంటివారని, ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్ వ్యవస్థ కలిగిన బ్యాంకులన్నీ శనివారం లోపు వివరాలను 31 కాలమ్స్‌లో పూర్తిచేసి పంపాలన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ల వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. ప్రొఫార్మా,ఆధార్, రేషన్‌కార్డుల నంబర్లు వారికి అందనట్లయితే వెంటనే ఎల్‌డీఎంను, డీఎస్‌వోను సంప్రదించాలన్నారు.
వ్యవసాయ పంట రుణాలు, బంగారుపై వ్యవసాయ రుణాలు పొందిన వారిలో కుటుంబం యూనిట్‌గా రూ.1.5లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు జీవోలోని అంశాలను ఎలా అమలు చేస్తారన్న విషయాలను గ్రామకార్యదర్శులు, వీఆర్వోలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. జిల్లాలో 4లక్షల మంది రైతులున్నట్లు అంచనా అని, రుణమాఫీలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలన్నారు. ప్రజలు అడిగినప్పుడు రుణమాఫీపై అధికారులు సమాచారాన్ని వివరించాలన్నారు. దళారులు ఇందులో ప్రవేశించకుండా రైతులను మోసగించకుండా పథకంపై స్పష్టమైన అవగాహన పెంపొందించాలన్నారు.
తెలుగులో ముద్రించిన రుణమాఫీ జీవో ప్రతులను కరపత్రాల రూపంలో అన్ని గ్రామాల్లో పంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌చార్జ్ జేడీఏ నిర్మల్ నిత్యానంద్, ఎన్‌ఐసీ అధికారి అనిల్, డివిజన్‌లోని ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
రుణమాఫీ కోసం పక్కా సమాచారం ఇవ్వండి
Published Fri, Sep 5 2014 2:10 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement