ఎక్కడ నుంచో వచ్చినా.. పాలమూరు నన్ను ఎంపీగా గెలిపించింది. ఇక్కడి ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. ఈ ఘనత పాలమూరు ప్రజలదే. ఈ జి ల్లాకు బాకీ ఉన్నా. వలసలు, కరువుతో జిల్లా ఆగమైంది. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిచే పాలమూరులోనా అంటూ ఇక్కడి కవులు ప్రజల కడగండ్లకు అద్దం పట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్ కథ ముగిసి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగు నీరందించి పచ్చని పాలమూరుగా తీర్చిదిద్దుతా. పాలమూరు నుంచి ముంబైకి వలస వెళ్లడం కాదు. ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు వలస వచ్చేలా చూస్తా.
-2014 సాధారణ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆయన
హామీలను జనం మరోమారు మననం చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. తొలి పర్యటన కేవలం ప్రైవేటు కంపెనీల్లో ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలకు పరిమితం కానుంది. ఎక్కడా అధికారులతో భేటీ జరపడం కానీ, సభలు, సమావేశాలు లేకుండానే సీఎం పర్యటన ముగియనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఇతరత్రా ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి స్పందించే అవకాశంలేదని అధికారవర్గాలు వెల్లడిం చాయి. 2009-14 మధ్యకాలం లో మహబూబ్‌నగర్ ఎంపీగా వ్యవహరించిన కేసీఆర్‌కు ఇక్కడి సమస్యలు తెలుసని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటి కే ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ య్య, మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీ ష్‌రావు జిల్లాలో పర్యటిం చారు. అయితే కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు కావస్తున్నా కొన్ని ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోవడంపై ప్రజానీకంలో ఆందోళన కనిపిస్తోంది. రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రియింబర్సుమెంటు వం టి అంశాలపై ఆయా వర్గాలు ఇప్పటికే ఆందోళనబాట పట్టాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు నీట మునగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటి ల్లింది. కీలక విభాగాలకు అధికారులు లేకపోవడంతో పాలన కుంటు పడిందనే భావన వ్యక్తమవుతోంది.
సీఎం ఎన్నికల హామీలు ఇవే!
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు చొప్పున 14లక్షల ఎకరాలకు సాగునీరందించడం
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడం
పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధుల విడుదల, జూరాల-పాకాల సర్వే పూర్తి
నాగర్‌కర్నూలు, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు. మొదటి ప్రాధాన్యతలో నాగర్‌కర్నూలు.
ప్రతి నియోజకవర్గంలో మండలానికి వేయి ఇళ్ల చొప్పున మంజూరు.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు మండలంలో నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చేప పిల్లల కేంద్రం ఏర్పాటు.
వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. పన్నులో రాయితీ.
కేసీఆర్, హామీలు, రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రియింబర్సుమెంటు