చేయూత ఏదీ? | None of support? | Sakshi
Sakshi News home page

చేయూత ఏదీ?

Published Tue, Mar 24 2015 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

None of support?

ధర్మవరం : చేనేత కార్మికునికి చచే ్చదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. మగ్గం గుంతల్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఎదుగూ బొదుగూ లేని జీవితాలతో కార్మికులు అవస్థ పడుతున్నారు. పవర్‌లూమ్స్‌పై విరివిగా తయారవుతున్న వస్త్రాలు చేనేత రంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, సిండికేట్‌నగర్, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో 80 వేల కుటుంబాలకు పైగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి.

ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 5లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌పై పలు డిజైన్లలో చీరలు తయారవుతుండడం, వాటినే చేనేత చీరలుగా తక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తుండడంతో చేనేత చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏడాదికి రూ. కోటి విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

 ఉన్నత చదువులకు దూరం
చేనేతల పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు. కుటుంబం గడవటమే కష్టంగాఉన్న నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి 10వ తరగతితో సరిపెడుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత సహకార సంఘాలున్నా అధిక శాతం మంది కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్దనే పనిచేయాల్సి వస్తోంది. వారు నిర్ణయించిందే ధర. ఇచ్చేదే కూలి.
 పాలకులకు పట్టనిహెల్త్ కార్డులు
 
నిత్యం మగ్గం గుంతలో గడిపే చేనేత కార్మికులకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో పైసా ఉండని పరిస్థితి. 2012 ఆగస్టు15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్వచ్చత బీమా యోజన పేరిట ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక చేనేత కుటుంబంలో ఐదుగురు సభ్యులకు రూ. 37,500 కేటాయించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా వాడుకోవచ్చునని సూచించారు. అయితే.. ఆ హెల్త్ కార్డుల కాలపరిమితి ముగుస్తోందని కార్మికులు చెప్పడంతో  కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరునెలల గడువును పెంచారు. ఆ గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కార్మికులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
 
రుణాల్లోనూ మొండిచేయే..
 ఎలాంటి హామీ లేకుండా ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలవరకు రుణాలను మంజూరు చేసేవారు. వీటిపై ప్రభుత్వమే 84 శాతం గ్యారంటీ ఇచ్చేది. అయితే.. ఈ నిధులను రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదని చేనేత నాయకులు చెబుతున్నారు. జిల్లాలో ఈ రుణాలను పొందినవారు వందల్లో ఉంటారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్‌లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే..  ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.46 కోట్లతోనే సరిపెట్టారు.  ఇందులో ఖర్చులు, చేనేతశాఖ సిబ్బంది వేతనాలు  పోను ఎంత మేర కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
   
చేనేత ఆత్మహత్యలు పెరుగుతాయి
ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో ఊతమివ్వాల్సిన ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం పట్టించుకోకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చీరలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందే. లేకపోతే చేనేతల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం.
 -పోలా రామాంజినేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 
చేనేత రంగాన్ని విస్మరించారు
బడ్జెట్‌లో చేనేత రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది.  ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రంగమే మనుగడ  కష్టం. అదీకాక చేనేత రంగానికి చేయూతగా ఉన్న పథకాలన్నింటినీ ఒకేగాటన కట్టారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది.
 -జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 
గతంతో పోల్చితే చాలా తక్కువ
ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.48 కోట్లు కేవలం అధికారులకు సంబంధించిన వేతనాలు, ఇతరత్రా వాటికే సరిపోతాయి. ఇక కార్మికులకు ఏమి ప్రయోజనం? అసలే గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న చేనేత రంగానికి ఇది అశనిపాతమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. చేనేతలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు.
 -రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్‌నాయకుడు
 
 18డిఎంఎం02ఎ- మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు
 18డిఎంఎంఎ02బి- పోలా రామాంజినేయులు
 18డిఎంఎం012స- జింకాచలపతి
 18డిఎంఎం02డి- రంగన అశ్వర్థనారాయణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement