సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చేనేత కార్మికుల సమస్యలపై రాపోలు భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. లాక్‌డౌన్ సమయంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించగా దీనిపై కౌంటర్ దాఖలు చేశామని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నేత కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఏ ఒక్క చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం కింద ఖాతాలో కనీసం 100 రూపాయలు జమ కాలేదని తెలిపారు. (‘చేయూత’ లాక్ తీశాం..)
అందరితోపాటు బియ్యం, రూ.1500 మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం మే 26న షోకాజు నోటీసు ఇవ్వగా ప్రభుత్వం స్పందించి ఇప్పటివరకు తయారైన మొత్తం సరుకును 45 రోజుల్లో కొంటామని తర్వాతే రోజే సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. కేవలం ప్రధాన న్యాయమూర్తి చలవతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం తప్పులతో కూడి ఉందని, తగిన సమాచారంతో ఒక రీజాయిండర్ వేస్తామని తెలిపారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోఆపరేటివ్ సొసైటీల నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుందని, అందుకు వారం రోజుల గడువు న్యాయస్థానాన్ని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం పది రోజుల గడువు ఇచ్చింది. (చేనేత, హస్తకళలకు మరింత ప్రోత్సాహం)
Comments
Please login to add a commentAdd a comment