ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు | AP Government Changed Handloom workers life with YSR Nethanna Nestham | Sakshi
Sakshi News home page

ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు

Published Sat, Jul 11 2020 4:38 AM | Last Updated on Sat, Jul 11 2020 5:17 AM

AP Government Changed Handloom workers life with YSR Nethanna Nestham - Sakshi

విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తుంటే.. మంగళగిరికి ఇవతల ఆత్మకూరు రోడ్డులోని మసీదుకు దగ్గర్లో ఓ చిన్న ఇంటి నుంచి టకా టకామంటూ శబ్దం వినిపిస్తోంది. అదేంటో అని చూస్తే అందులో 60 ఏళ్ల వ్యక్తి గుంటలో కూర్చొని మగ్గం నేస్తున్నాడు. ఆయన పేరు ఉమ్మలేటి నాగేశ్వరరావు. 60–70 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఇప్పుడు మగ్గం మోగుతోంది. రాట్నం తిరుగుతోంది. కండె పోసుకుంటోంది. కారణం..‘రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నేతన్న నేస్తం పథకం కింద రూ.24 వేల సాయం అందించడమే..’ అంటున్నారు నాగేశ్వరరావు దంపతులు. 

జీపీ వెంకటేశ్వర్లు, ఎ.అమరయ్య
చేనేత.. రాష్ట్ర సంస్కృతి, నాగరికతకు చిహ్నం. ఒకప్పుడు వ్యవసాయం తర్వాత బాగా ఉపాధిని కల్పించిన రంగం. కానీ, నిన్న మొన్నటి వరకు ఈ వృత్తి బాగా చితికిపోయింది. ఈ రంగానికి ఊతమిచ్చే ప్రక్రియలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ 6 నెలల కాలంలో ఒక్కో కుటుంబానికి రెండు విడతలుగా రూ.48 వేలను అందించారు. దీంతో చేనేతల ఆనందానికి అవధుల్లేవు. వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపిందన్న భావన చేనేతల జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులకు స్పష్టంగా కనిపించింది. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక సాయం అందిందని, ఈ నగదు తమ బతుకులు మార్చుకునేందుకు, మగ్గం పునరుద్ధరణకు ఉపయోగపడిందని లబ్ధిదారులే స్వయంగా చెప్పడం గమనార్హం. పరిశీలనలో గుర్తించిన అంశాలివీ..

► వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద గత ఏడాది డిసెంబర్‌లో 81,783 కుటుంబాలకు రూ.24వేల వంతున రూ.196.28 కోట్లు సాయం చేసింది. 
► ఈ ఏడాది జూన్‌ 20న 81,024 చేనేత కుటుంబాలకు రూ.194.46 కోట్లు సాయం అందించింది. వాస్తవ కార్మికులు, మగ్గాలున్న వారికే సాయం అందడంతో మగ్గాల్లో కదలిక వచ్చింది. 
► ప్రభుత్వ సాయంతో ఎక్కువ మంది మగ్గం నడవడానికి అవసరమైన ముడి సరకుల్నే కొనుగోలు చేశారంటున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన నక్కా వెంకటేశ్వరరావు.
► చేనేత కార్మికులకు నేరుగా సాయం చేయడంతో సొంతంగా బట్టలు తయారుచేసుకునే పరిస్థితి ఏర్పడిందని మంగళగిరికి చెందిన ఎం.హనుమంతరావు చెప్పారు. 
► నిజానికి రాష్ట్రంలో చేనేతలను మాస్టర్‌ వీవర్లు తమ కనుసన్నల్లో నడిపించే వారు. వారు పెట్టుబడి సాయం చేస్తేనే కార్మికులు బట్టలు నేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది.
► చేనేత సహకార సంఘాలకు మంచి రోజులు రానున్నాయి. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఆప్కోకు నిధులు విడుదల చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆదుకున్న ప్రభుత్వం
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కష్టాల్లో ఉన్న సుమారు 82 వేల చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. బియ్యం, కందిప్పు, నూనె వంటి నిత్యావసారాలు కూడా అందించి ఆదుకుంది. 50 ఏళ్లు నిండిన 1,07,674 మంది చేనేతలకు నెలనెలా రూ.2,250ల వంతున పెన్షన్‌ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది.

ఇవీ సమస్యలు..
► ఉత్పాదక వ్యయం పెరగడం
► పరపతి సమస్య
► మార్కెటింగ్‌ చికాకులు
► ఆధునికీకరణ లేకపోవడం
► బతకలేక ఇతర రంగాల్లోకి వెళ్లిపోవడం..
► కనీస మౌలిక వసతులు లేకపోవడం
► సరైన పరిశోధన, అభివృద్ధి లేకపోవడం
► విశ్వసనీయ డేటా కొరవడడం

పరిష్కార మార్గాలు...
► ఆర్థిక రంగంలో చేనేత పరిశ్రమ సామాజిక, ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించడం
► ఆత్మాభిమానంతో మనుగడ సాగించే చేనేత వంటి రంగాలకు ఆర్థికంగా ఊతమివ్వడం
► చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రోత్సహించడం
► ఈ రంగంలోని కొత్త తరాన్ని నూతన ధృక్పథానికి అనుగుణంగా తీర్చిదిద్ది సమీకృతాభివృద్ధిలో భాగస్వాములను చేయడం.

నేతన్నల బాగు కోసం అధ్యయనం 
చేనేతలకు ఎవ్వరూ చేయని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ సాయం చేస్తున్నారు. నిరంతరం వీరి బాగు కోసం అధ్యయనం చేస్తాం. సొంతంగా వాళ్లు బట్టలు నేసి అమ్ముకునేలా చేస్తాం. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద అప్పులు చేసే పరిస్థితిని రానివ్వం. ఆప్కోను గాడిలోకి తీసుకురావడమే కాకుండా వీవర్స్‌ తయారుచేసిన బట్టలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. 
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, చేనేత జౌళీ శాఖ మంత్రి

జగన్‌ నిర్ణయం దేశానికే ఆదర్శం
15 ఏళ్లుగా చేనేత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన నేతన్న నేస్తం పథకం దేశానికే ఆదర్శం కావాలి. వడ్డీలు తగ్గించి కనీసం లక్షకు తక్కువ కాకుండా కార్మికునికి రుణం ఇప్పించాలి. ముడి సరుకు కొనుగోలుపై సబ్సిడీ పెంచితే బాగుంటుంది. ప్రభుత్వమే కొనుగోలు దుకాణాలు ఏర్పాటుచేసి మార్కెటింగ్‌ను విస్తృత పరచాలి. 
– డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి, జౌళి విధాన రంగ నిపుణులు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
చేనేతల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మా సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులైతే అప్పుకు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అడ్డగోలు లాభాలు చూసుకోదు కాబట్టి సామాన్యులకు అనుకూలమైన ధరకు అమ్మడమే కాకుండా నేత నేసిన మాకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది.  
– పడవల ఉమామహేశ్వరరావు, బండారులంక, తూర్పుగోదావరి జిల్లా

మగ్గం పట్టిన ప్రతి కార్మికునికీ అండగా..
సడుగులిరిగిన మగ్గానికి సీఎం వైఎస్‌ జగన్‌ కొత్త వన్నె తెచ్చారు. పడుగు వడుపు పెంచారు. స్వాతంత్య్రానంతర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతటి సాహసాన్ని ఆయన చేసి చూపించారు. ఇప్పటివరకు పాలకులు ఆయా వర్గాల నాయకులకే రాయితీలిచ్చి జోకొట్టారు. కానీ, వైఎస్‌ జగన్‌ మాత్రం మగ్గం పట్టిన ప్రతి కార్మికునికీ అండగా నిలిచారు. 
– బొద్దుల కనకరామారావు, చేనేత కార్మికులు, ఆత్మకూరు, గుంటూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement