చేనేతలకు ఆపన్నహస్తం | AP CM YS Jagan Mohan Reddy Launches Netanna Nestam Scheme At Amaravathi | Sakshi
Sakshi News home page

చేనేతలకు ఆపన్నహస్తం

Published Sat, Dec 21 2019 5:02 AM | Last Updated on Sat, Dec 21 2019 1:19 PM

AP CM YS Jagan Mohan Reddy Launches Netanna Nestam Scheme At Amaravathi - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని.. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు అపూర్వ సంక్షేమ పథకం ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ను ప్రవేశపెడుతోంది. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, హస్త కళలకు పూర్వ వైభవం తేవడమే కాకుండా కేవలం మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న వారికి మరింత తోడ్పాటునివ్వడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఈనెల 21న అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.
(చదవండి : రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు)

ముడిసరుకు కొనుగోలుకు అవకాశం
మరమగ్గాలు వచ్చిన తరువాత చేనేతలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో చేతి ద్వారా నేత నేసే నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సాయం తోడ్పాటునిస్తుందని చేనేత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మగ్గాలను బాగు చేయించుకోవడం, నూలు, రంగులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మగ్గంపై నేత నేయాలంటే నేత కార్మికుడు అప్పుచేయాల్సిందే. అది కూడా ముందుగానే చీరలు, ఇతర వస్త్రాలు కొనుగోలు చేసే పెట్టుబడిదారుల నుంచి అప్పులు తీసుకుంటారు. వీటిని తీర్చలేక నేసిన వస్త్రాలు వారికే విక్రయిస్తారు. అప్పు ఇచ్చిన వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.

ఈ పరిస్థితుల నుంచి వీరికి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలని సంకల్పించి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’కు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 81,783 మంది నేతన్నలను గుర్తించారు. అలాగే, ఇందుకోసం రూ.196.27కోట్లు ఖర్చు చేయనుంది. అర్హులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ.. ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరు.. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా పెడన, నెల్లూరు జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, వైఎస్సార్‌ జిల్లాలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మాధవరం, అప్పనపల్లె వంటి పేరుగాంచిన పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా నేతన్నలు వస్త్రాలు తయారుచేస్తున్నారు.

ఏ ప్రభుత్వం చేయని విధంగా..
నేను పదో తరగతి వరకు చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులవల్ల పై చదువులకు వెళ్లలేకపోయా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేత నేస్తూనే ఉన్నా. ఇప్పటివరకు చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం కింద రూ.24వేలు ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం. దీంతో ఆధునిక పరికరాలు కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుంది.
– మరక షణ్ముఖరావు, పెడన, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement